కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అధికారుల ముందుచూపు లేకపోవడం ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల వేళ వేతనాలు అందక అవుట్ సోర్సింగ్ కార్మికులు, వారి కుటుంబాలు పస్తులు ఉండే దుస్థితి నెలకొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ప్రతీనెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే ఆనవాయితీ ఉంది. ఈనెల మూడోవారం గడుస్తున్నా చెల్లింపులు లేవు. దీంతో పండుగలు ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
600 మంది పడిగాపులు...
కార్పొరేషన్‌లోని శానిటేషన్ విభాగంలో 448 మంది, ఆఫీసులోని పలు విభాగాల్లో మరో 125 మందితోపాటు మరికొందరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు వేతనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. వేతనాల కోసం సుమారు రూ.కోటి 30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంది.
ఆదాయం తగ్గి.. నిర్వహణ కష్టాలు..
బల్దియాకు ప్రధాన ఆదాయం ఆస్తిపన్ను, నల్లాబిల్లులే. అవుట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, విద్యుత్ చార్జీలు వంటి ఖర్చులు సాధారణ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను 60శాతం కూడా వసూలు కాలేదు.
నల్లా బిల్లుల్లో సాంకేతిక సమస్యలు
నల్లావివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు. బకాయిలు వసూలు కావడంలేదు. తాజా బిల్లులు స్వీకరిస్తున్నారు. ఆఫ్‌లైన్ చెల్లింపులకు వచ్చిన వినియోగదారుల నుంచి కూడా డబ్బులు తీసుకోడంలేదు. దీంతో బల్దియా ఆదాయానికి బ్రేక్ పడింది. మొత్తంగా ఆస్తిపన్ను, నల్లాబిల్లులు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది.
పర్యవేక్షణ లోపం
వసూళ్ల కోసం సిబ్బంది పెద్దసంఖ్యలోనే ఉన్నారు. పర్యవేక్షణ లేక ఫలితాలు కనిపించడం లేదు. లక్ష్యం ఉన్నా, అమలులోనే లోపం తలెత్తింది.
మళ్లించిన నిధులు.. ఇప్పుడు భారంగా...
ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదాడి క్రితమే స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.16 కోట్లు విడుదల చేసింది. ఇందులో అవుట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లుల వినియోగంతోపాటు అవసరైనతే వేతనాలకు ఆరు నెలలకు సరిపడా నిధులు నిల్వ చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ముందుచూపు లేకుండా అధికారులు వీటిని ఇతర అవసరాలకు మళ్లించారు. పర్యవసాణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆరోపణలు వస్తున్నాయి.
మార్చిలోనే సంక్షోభం
సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లో బల్దియా ఆదా యం పెరుగుతుండడంతో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. ఈసారి మార్చిలోనే సంక్షోభం రావడం విస్మయం కలిగిస్తోంది.
మూడోవారం గడుస్తున్నా కార్మికులకు అందని వేతనాలు
ఏడాది క్రితమే రామగుండానికి రూ.16 కోట్ల స్టాంప్ డ్యూటీ
వేతనాలకు సరిపడా నిధులు నిల్వ ఉంచాలని ఉత్తర్వులు
ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల ఎడాపెడా ఖర్చులు
బల్దియా కార్మిక కుటుంబాలకు పండుగపూట తప్పని పస్తులు


