సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌లో సోమవారం రాత్రి మైనర్ల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోటు ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జన్మదిన వేడుకల సందర్భంగా ఒకేచోట చేరిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా కొందరు కత్తులతో దాడికి దిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసులో సంబంధిత మైనర్లతో పాటు ఘటన సమయంలో అక్కడ ఉన్న వారందరినీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
26 నుంచి ఆర్టిజన్ల ఉద్యమం
రామగుండం/పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్(టీవీఏఈ జేఏసీ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ తూళ్ల నాగరాజు కోరారు. ఈమేరకు విద్యుత్ సంస్థల సీఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్, టీజీట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీసీఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లకు సమ్మె నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా, 30న రెండోసారి ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా, వంటావార్పు, ఏప్రిల్ 4న కేటీపీఎస్–పాల్వంచ జెన్‌కో విద్యుత్ కేంద్రం ఎదుట ధర్నా, ఏప్రిల్ 7న ‘చలో వరంగల్’తో టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అయినా, యాజమాన్యా లు, ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.


