జగిత్యాలక్రైం: ప్రజలకు మ రింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. నేరం జరిగిన తరువాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక భారంగా మారొద్దనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉందన్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 5 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సమాచారమందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదు స్వీకరిస్తారన్నారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.
పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పోలీస్ స్టేషన్ పరిసరాలుండాలని ఎస్పీ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రేమిసెస్ మెయింటెనెన్స్–క్లీన్–గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో చెత్త తొలగించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.


