కోరుట్ల: పట్టణంలోని రష్మీదర్ తేజ ఎలిమెంటరీ ఉపాధ్యాయ, బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల విద్యార్థులకు సోమవారం తెలంగాణ జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో ప్రకృతి వనరులపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ నూ తన సాంకేతికతలపై వివరించారు. అధ్యాపకులు శ్రీనివాస్, అజీబ్, బోదనపు నటరాజ్ హాజియా, రాజేంద్రప్రాసాద్, లక్ష్మీనారాయణ, పద్మ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
కారోబార్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు
కోరుట్ల రూరల్: మండలంలోని మోహన్‌రావుపేట కారోబార్ రంగు రాజేశ్‌పై ఆ గ్రామ ఉప సర్పంచ్ సహ పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవో రామకృష్ణకు సోమవారం ఫిర్యాదు చేశారు. కారోబార్ గ్రామంలో ఎలాంటి పనులు చేయటం లేదని, పరిసరాలు పరిశుభ్రం విషయంలో పట్టించుకోవటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. కారోబార్‌ను విదుల నుంచి తొలగించాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులో కోరారు.
ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలి
వెల్గటూర్: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలని ఎస్సై ఉదయ్‌కుమార్ అన్నారు. మండలంలోని స్తంభంపల్లి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చట్టాలపై అవగాహన నిర్వహించారు. పోలీసు చట్టాలు, షీ టీమ్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థుల క్రమశిక్షణ, డయల్100 వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల అధ్యాపక బృందం, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.
ఎంఐఎం సభ్యుల వాకౌట్ సిగ్గుచేటు
కోరుట్ల: రాష్ట్ర శాసనసభలో వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో శాసన సభ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయటం సిగ్గు చేటని బీజేపీ మాజీ కౌన్సిలర్ పెండెం గణేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దేశంలో ఉంటూ చట్ట సభల్లో పదవులు అనుభవిస్తూ వందేమాతర గీతాన్ని అవమాన పర్చటం సరికాదని అన్నారు. అలాంటి సభ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి కేసులో అరెస్టు
కరీంనగర్‌క్రైం: కాంట్రాక్టుర్లు, పలువురు ఉద్యోగుల వద్ద బీనామీ అకౌంట్ ద్వారా లంచం తీసుకున్న కేసులో తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.


