● ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసిన గ్రామస్తులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికై న రాంపల్లి పంచాయతీ సర్పంచ్ కనపర్తి సంపత్‌రావుతో పాలకమండలి సభ్యులు తీసుకున్న నిర్ణయాలకు దాతలు సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సోమవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో విత్తనసంస్థ ప్రతినిధులు 600 స్టీలు ప్లేట్లు, స్టీలు గ్లాసులను సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్, ఎంపీడీవో శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఏకగ్రీవ పంచాయతీ తొలి సమావేశంలోనే ప్లాస్టిక్ భూతాన్ని గ్రామంలో నుంచి తరిమేయడంతో పాటు మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను గ్రామంలో నిషేధించడంతో అందుకు ప్రత్యామ్నాయంగా పంచాయతీ ఆఫీసు ద్వారానే స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందుబాటులో ఉంచాలని సర్పంచ్ నిర్ణయించారు. ఇందుకు ఓ విత్తన సంస్థ ప్రతినిధులు స్టీల్‌సామగ్రిని విరాళంగా సమకూర్చారు. దీంతో పంచాయతీలో ‘స్టీల్‌బ్యాంకు’ ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ ఆఫీసు నుంచి సామగ్రి తీసుకెళ్లి తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
డొమెస్టిక్ సిలిండర్లు సీజ్
జమ్మికుంట: పట్టణంలోని పలు హోటళ్లు, టీస్టాళ్లలో డీటీసీ ఎస్.వసంతరావు, ఎఫ్‌ఐ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. హోటల్‌లో వాడుతున్న 18 డొమెస్టిక్ సిలిండర్లును సీజ్ చేశారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదుకు కరీంనగర్ సివిల్ సప్‌లై ఉన్నతాధికారులు నివేదిస్తామన్నారు.


