7న నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 7న జరుగుతుందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్ల పంపిణీ ఆన్‌లైన్ ద్వారా చేశామని, డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇంకా హాల్ టికెట్ రానివారు ఈ నెల 4న చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 7989693572 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
రూ.1.40 లక్షల నగదు సీజ్
సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ 03బీ జెడ్ 9740 నంబర్ గల కారును తనిఖీ చేయగా, అనుమానాస్పద నగదు రూ.1.40 లక్షలను పోలీసులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌కు చెందిన డ్రైవర్ నందగిరి నాగరాజు నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
కరీంనగర్‌క్రైం: ఓ మహిళ కరీంనగర్ బస్టాండ్ సమీపంలో తన బంగారు ఆభరణాలు కలిగిన పర్సు పోగొట్టుకోగా ఆటోడ్రైవర్‌కు దొరకడంతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో అందచేసి నిజాయితీ చాటుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి మంగళవారం ఇల్లంతకుంట మండలం జవారీపేటకు వెళ్లేందుకు కరీంనగర్ వచ్చింది. బస్టాండు సమీపంలో 1.5 తులాల బంగారు రింగు, గుండ్లు, నగదు కలిగిన పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సు భగత్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ కోలపూరి జగన్‌కు దొరికింది. బస్టాండులోని పోలీసు అవుట్‌పోస్టు వద్దకు వచ్చి వన్‌టౌన్ ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో లక్ష్మీకి పర్సు అందజేశాడు. ఆటోడ్రైవర్ జగన్‌ను పోలీసులు, స్థానికులు అభినందించారు.
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామంలో రైతుల చేల వద్ద బావులు, బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కనెక్టింగ్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సుమారు 20మంది రైతుల కేబుల్ వైర్లు సోమవారం రాత్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన పలువురు రైతులు వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు వైర్లు కట్‌చేసి తీసుకెళ్లి ఉంటారని గంగారెడ్డి తదితర రైతులు చెబుతున్నారు. ఇలా పలుసార్లు పొలాల వద్ద వైర్లు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మెట్‌పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. సాయిరాంకాలనీకి చెందిన కేతావత్ ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు జలిగం వెంకటేశ్‌తో కలిసి సోమవారం రాత్రి సమయంలో కోరుట్లకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆరపేట వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రవీణ్ భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


