మహిళా ఓటర్లే కీలకం
ఐదు బల్దియాల్లోనూ వారిదే అగ్రస్థానం తమ వైపు తిప్పుకొనేందుకు నేతల యత్నాలు ఇప్పటినుంచే తాయిలాల ప్రకటన ప్రధాన పార్టీలన్నీ అదే దారిలో.. అతివల మొగ్గు ఎటువైపో..?
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మహిళల ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. గెలుపోటముల్లో వీరి ప్రభావమే అత్యధికంగా ఉంటుంది. ఏ బల్దియాలో చూసినా సుమారు మూడు వేల నుంచి నాలుగువేల మంది ఎక్కువగా మహిళలే ఓటర్లుగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నాయకులు వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయతాలు ప్రారంభించారు. ఈ సారి మహిళలకు రిజర్వేషన్ సగం మేర కేటాయించడంతో కొందరు నాయకులు కలిసివచ్చే స్థానాల్లో వారి సతులనే బరిలోకి దింపుతున్నారు. ఎలాగైనా మహిళల ఓట్లను ఆకర్షించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఓటర్ తుది జాబితా విడుదల కావడం.. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక కచ్చితంగా పోటీలో నిలబడే వ్యక్తులు వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు. పార్టీలను పక్కకు పెట్టి ఎక్కువగా సొంత ప్రచారమే చేపడుతున్నారు. టికెట్లు వస్తాయో లేవో.. రాని రాకపోని.. అన్న ఉద్దేశంతో పోటీకై తే నిలబడాలనే ఉద్దేశంతో ప్రచారం మొదలుపెట్టారు. అవ్వ.. అన్న.. తమను ఆశీర్వదించాలి అని.. తమకే ఓటు వేయాలంటూ ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఆశావహులంతా గల్లీగల్లీన తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన అనంతరమే టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థిగానే ప్రచారం చేసుకుంటున్నారు. వార్డుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలసమస్యలతోపాటు, ఏ సమస్యనైనా పరిష్కరిస్తామంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు స్పష్టంగా రావడంతో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రంగంలోకి దిగేందుకు ప్రలోభాలకు సిద్ధమవుతున్నారు. సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.
సొంత ఖర్చులతో..
కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రతి కాలనీల్లో తిరుగుతూ అవ్వ.. అక్క.. చెల్లె అంటూ పలుకరిస్తున్నారు. ఫలితంగా కాలనీల్లో అప్పుడే సందడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేకుండానే ప్రచారమైతే చేపడుతున్నారు. టికెట్లు వచ్చినా రాకున్నా పోటీలో ఉంటామని పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఇప్పటికే సర్వే చేయించినట్లు తెలిసింది. అభ్యర్థి వార్డులో మంచి పేరు కలిగి ఉండటంతో పాటు, ఆర్థికంగా కలిగిన వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
మహిళా సంఘాలను
పలుకరిస్తూ..
ఐదు మున్సిపాలిటీల్లో పోటీలో ఉన్న ఆశావహులు మహిళ ఓట్లు సాధించాలన్న ఉద్దేశంతో మహిళాసంఘాలను కలుస్తూ వారికి కావాల్సిన పనులు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సతులతో ప్రచారం చేయిస్తూ.. వారితోనైనా మహిళ ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు. మహిళ సంఘాలు గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం ఉండటంతో ఆ గ్రూపులో ఉన్న సభ్యులందరినీ కలుస్తున్నారు. మహిళాసంఘాలకు కావాల్సిన రుణా లు, ఇతరత్రా పనులు చేసి పెడుతున్నారు. కొన్ని వార్డుల్లో మహిళాసంఘాల్లో ఉన్న వారే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
బల్దియా మొత్తంఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు జగిత్యాల 96,411 46,794 49,596 21
కోరుట్ల 63,741 30,709 33,030 2
మెట్‌పల్లి 46,371 22,360 24,010 1
ధర్మపురి 14,222 6,826 7,393 3
రాయికల్ 13,195 6,209 6,986 0
మొత్తం 2,33,940 1,12,898 1,21,015 27
మహిళా ఓటర్లే కీలకం


