వైద్యసేవలన్నీ అందుబాటులోకి..
జగిత్యాల: జిల్లాలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం శంకుస్థాపన చేశారు. క్రిటికల్ కేర్, మెడిసిన్ స్టోర్ సెంటర్‌ను ప్రారంభించారు. రూ.23.5 కోట్లతో క్రిటికల్ కేర్, రూ.3 కోట్లతో మెడిసిన్ స్టోర్ ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి క్రిటికల్ కేర్‌లో అత్యవసర వైద్యసేవలు అందుతాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ సహకారంతో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రానున్న బడ్జెట్‌లో ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేలా కృషి చేస్తామన్నారు. వైద్యశాలకు కావాల్సిన డాక్టర్లు, సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం వైద్యులకే ఉంటుందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ 450 పడకల ఆస్పత్రి, క్రిటికల్ కేర్ ప్రారంభించండం అభినందనీయమన్నారు. గుండె, నరాలు, ప్లాస్టిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో లభ్యమవుతుందన్నారు. జగిత్యాలకు అంబులెన్స్, ఎంఆర్‌ఐ స్కాన్, వైద్య విద్యార్థులకు మూడు బస్సులు ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునీల్‌కుమార్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వృద్ధులకు అండగా ఉంటాం
వయోవృద్ధులకు అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణమ్‌డేకేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, నరేశ్, రాజ్‌కుమార్, నాగభూషణం, జ్యోతి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సెకెండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సెకెండ్ ఏఎన్‌ఎంల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మధురిమ మంత్రికి వినతిపత్రం అందించారు. నాయకులు రజితబాయి, శారద, రజిత, సౌజన్య, యమున, సరోజ, శిరీష, శైలజ, జయప్రద, జ్యోతి, ఉజ్వల, స్రవంతి, మహేశ్వరి, మధులత పాల్గొన్నారు.


