లక్ష్మీపూర్ ఎఫ్‌పీవో పరిశీలన
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థను కొమురంభీంఆసిఫాబాద్ జిల్లాలోని 20 మండలాల రైతులు మంగళవారం సందర్శించారు. లక్ష్మీపూర్ రైతులు ఫార్మర్స్ ప్రొడ్యూషర్ ఆర్గనైజేషన్‌గా ఏర్పడి చేపడుతున్న అభివృద్ధి, పంట లను పరిశీలించారు. ఎఫ్‌పీవో చైర్మన్ పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 750 మంది సభ్యులతో ఎఫ్‌పీవో నడుస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్‌కుమార్, అగ్రికల్చర్ ప్రతినిధి సుధీర్, కో–ఆర్డినేటర్లు రాజు, మాధవి, సీఈఓ తిరుపతి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు ఎస్సైలు బదిలీ
జగిత్యాలక్రైం: జిల్లాలోని ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌ను మల్లాపూర్ ఎస్సైగా, మల్లాపూర్ ఎస్సై రాజును జగిత్యాల సీసీఎస్‌కు, కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్‌ను ఇబ్రహీంపట్నం ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల పట్టణ ఎస్సై రవికిరణ్‌ను కథలాపూర్ ఎస్సైగా అటాచ్ చేశారు.
రాయికల్ తహసీల్దార్‌కు మెమో
రాయికల్: రాయికల్ తహసీల్దార్ నాగార్జునకు మెమో జారీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జున అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడంపై మెమో జారీ చేస్తూ.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
జగిత్యాలరూరల్: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్, లచ్చక్కపేటలో ఉపాధి హామీ పనులు, నర్సరీలను పరిశీలించారు. గ్రామీణప్రాంతాల్లో కూలీలకు ఏటా 125 పనిదినాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కూలీందరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సలీం, ఏపీవో శ్రీలత, సర్పంచులు పాల్గొన్నారు.


