ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
జగిత్యాలజోన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నోడల్ అధికారులు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మున్సిపల్ ఎన్ని కలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, నామినేషన్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని, నామినేషన్ కేంద్రాన్ని మున్సి పల్ కమిషనర్లు స్వయంగా సందర్శించి, ఖరారు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత, వసతులు, ఎన్నికల కోడ్ అమలు, ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ పాల్గొన్నారు.
10వరకు అభ్యంతరాల స్వీకరణ
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వెలువరించిన ఓటర్ల జాబితాపై ఈ నెల 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒకే కుటుంబానికి చెందినవారి పేర్లు వేర్వేరు వార్డుల్లో వచ్చాయని, విలీన గ్రామాల్లోని వారందరిని ఒకేవార్డులో పేర్కొనలేదని, ఒకే ప్రాంతానికి చెందిన వారిని రెండు, మూడు వార్డుల్లో విభజించారంటూ రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను అదేశించారు.


