కష్టపడ్డ వారికే అవకాశం
రాయికల్/జగిత్యాలటౌన్: రాయికల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా వేస్తామని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన కార్యకర్తలకే బీఫాంలు అందజేస్తామని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాయికల్‌లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, వర్తక సంఘ భవనంలో మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పదేళ్లకాలంలో రాయికల్ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే వెంటనే మాదిగకుంటను హుస్సేన్‌సాగర్ తరహాలో మారుస్తామని, రూ.5 కోట్లతో ఫిల్టర్‌బెడ్ మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, మహిళ అధ్యక్షురాలు మమత, నాయకులు మ్యాకల అనురాధ, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, బాపురపు నర్సయ్య, కడకుంట్ల నరేశ్, షాకీర్, నాగరాజు, రాజిరెడ్డి, భూమయ్య పాల్గొన్నారు.
పారదర్శకంగా ఓటరు జాబితా ప్రకటించాలి
సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని జగిత్యాల మున్సిపాలిటీలోని వివిధవార్డుల్లో ఓటర్లుగా నమోదు చేయడం దారుణమని జీవన్‌రెడ్డి అన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల ని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి, ఆ లేఖ ప్రతిని కలెక్టర్ సత్యప్రసాద్‌కు అందజేశారు. పట్టణంలోని 48వార్డుల్లో మార్పులు చేయకుండా నూకపల్లి అర్బన్ కాలనీలో స్థిరపడిన కుటుంబాలతో 2వార్డులు ఏర్పాటు చేసి మొత్తం 50వార్డుల్లో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలని కోరారు.


