రిజర్వేషన్లపై ఉత్కంఠ
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు క్షేత్రస్థాయిలో అఽధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. వార్డుల రిజర్వేషన్ల మార్పు విషయంలో నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడడంలేదు. ఫలితంగా వార్డుల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ఇదివరకు ఉన్న రిజర్వేషన్లు మారితే ప్రత్యామ్నాయంగా ఎవరిని పోటీలో నిలపాలి..? ఈ మార్పును తట్టుకుని విజయం ఎలా సాధించాలి..? అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఈనెల 10న ఓటరు జాబితా ఫైనల్ చేసిన తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది.
మార్పుపై ఆశ..నిరాశ
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పు జరిగిన క్రమంలో ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. వార్డుల్లో ఓటరు లిస్టులు ఫైనల్ అయిన తరువాత ఆయా వార్డుల్లో కులాల వారీగా ఉన్న ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుందన్న ఆశల్లో కొంత మంది అభ్యర్థులు ఉన్నారు. మరికొందరు రిజర్వేషన్లు మారితే మళ్లీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న మీమాంసలో ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 136 వార్డులు ఉన్నాయి. ఈసారి వార్డుల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో ఆయా కులాలవారీగా జనాభాలో మార్పులు రానున్నాయి. తద్వారా రిజర్వేషన్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినవస్తున్నాయి.
ప్రత్యామాయాల వెతుకులాట..
ఇదివరకు ఉన్న రిజర్వేషన్లు మారితే సిట్టింగ్‌లు కొందరు మళ్లీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తమ తమ వార్డులను వదిలి వేరే వార్డులకు వెళ్లాలా..? లేక భార్య, లేదా తల్లిని ఎన్నికల బరిలో నిలపాలా..? అన్న యోచనలతో మీమాంసలో పడ్డారు. గతంలో రిజర్వేషన్‌లు అనుకూలించక అవకాశాలు కోల్పోయిన ఆశావహులు ఈ సారి రిజర్వేషన్లు మారితే తమకు కలిసివస్తుందన్న ఆశల్లో ఉన్నారు. ఒకవేళ రిజర్వేషన్లు వచ్చినా.. రాకున్నా పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రం తాము పోటీకి సిద్ధమైన వార్డుల్లో ఉన్న ఓటర్లను కలుస్తూ తమ ప్రచార సన్నాహాలకు పావులు కదుపుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయా..? మారుతాయా..? అన్న సందేహాలు బరిలో నిలిచే అభ్యర్థులను వేధిస్తున్నాయి. మరో వారం పాటు వేచిచూస్తే తప్ప రిజర్వేషన్ల మార్పు ఉందా..? లేదా అనే అంశంలో స్పష్టత రానుంది.
పుష్కర పనులకు ముహూర్తం ఎప్పుడో..?
రిజర్వేషన్లపై ఉత్కంఠ
రిజర్వేషన్లపై ఉత్కంఠ


