సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
జగిత్యాల: సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. మహిళల హక్కులు, దళిత సాధికారత, సామాజిక న్యాయం కోసం సావిత్రి పూలే పోరాడారన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ఆదర్శనీయమన్నారు. అవార్డులు పొందిన మహిళలను అభినందించారు.
గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు
2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని వసతులు కల్పించాలని, లింక్‌రోడ్లు నిర్మించాలని సూచించారు. 2015లో 1.50 కోట్ల మంది భక్తులు రాగా.. ఈసారి 4.50 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కర స్నానాలకు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బంది రానీయొద్దని, స్నానఘట్టాలకు నేరుగా చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డెప్యూటీ కలెక్టర్ పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/మల్యాల: సావి త్రిబాయిపూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో తిప్పన్నపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అయిత అనిత ఉత్తమ అవార్డు అందుకున్నారు. అలాగే మల్యాల మండలం తాటిపల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు భూక్య స్వర్ణలతకు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ అవార్డు అందించారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, డీఈవో రాము, మల్యాల ఎంఈవో జయసింహారావు పాల్గొన్నారు.


