రూ.7 కోట్ల పనులకు రూ.29 వేల రికవరీ
రాయికల్: రాయికల్ మండలంలోని 32 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులకు రూ.7,16,69,532 ఖర్చు కాగా, కేవలం రూ.29,870 రికవరీ జరిగినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. శుక్రవారం రాయికల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో మాట్లాడారు. 32 గ్రామాల్లో రూ.7,16,69,532 విలువ గల పనులు చేపట్టగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు డిసెంబర్ 24 నుంచి జనవరి 1వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి తనిఖీ చేపట్టారన్నారు. నివేదికను సమర్పించగా, ఈ పనులకు సంబంధించి కేవలం రూ.29,870 రికవరీ చేసినట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెక్నికల్ అసిస్టెంట్ రామును విధుల నుంచి తొలగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ మదన్‌మోహన్, ఎంపీవో సుష్మ, పీఆర్ ఏఈ ప్రసాద్, క్యూసీ మల్లికార్జున్, ఎస్‌ఆర్పీ దేవేందర్, కృష్ణారెడ్డి, ఏపీవో దివ్య, దేవేందర్‌రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.


