ఎన్నికల వ్యయం.. ఆశావహుల భయం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయం.. ఆశావహుల భయం

Nov 29 2025 6:59 AM | Updated on Nov 29 2025 6:59 AM

ఎన్నికల వ్యయం.. ఆశావహుల భయం

ఎన్నికల వ్యయం.. ఆశావహుల భయం

జగిత్యాల: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ఆశావహులు సర్పంచ్‌గా నిలబడాలంటే ఖర్చు భరించేదెలా అని ఆందోళన చెందుతున్నారు. కుల సంఘాలు, యువత, మహిళ సంఘాలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతీది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొంత భయాందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌గా నిలబడే అభ్యర్థులు కచ్చితంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రూ.5లక్షల నుంచి 10 లక్షల వరకు..

ఎన్నికల నిబంధనల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, తక్కువ ఉంటే రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుల విషయంలో 5 వేల మంచి జనాభా ఉంటే రూ.50 వేలు, తక్కువ ఉంటే రూ.30 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సర్పంచ్‌ అభ్యర్థులు చిన్న గ్రామాల్లో కనీసం రూ.5 లక్షల నుంచి పది లక్షలు, పెద్ద గ్రామాల్లో రూ.10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. కాగా, పట్టణాలకు దరిదాపుల్లో ఉన్న గ్రామాల్లో సర్పంచులకు తీవ్ర పోటీ ఉంటుంది. కాగా, మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థులకు కొంత మేర ఖర్చు మిగిలే అవకాశాలున్నా, 2,3వ విడతలకు చాలా సమయం ఉండడంతో వారు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే ఖర్చు చేస్తే అప్పులపాలయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

కలిసొచ్చిన షష్టి

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఈసారి అభ్యర్థులకు కొంత మేర కలిసి వచ్చినట్లే కన్పిస్తోంది. ప్రస్తుతం డిసెంబర్‌లో షష్టిమాసం సందర్భంగా చాలా మందికి మల్లన్నదేవుని మొక్కులు ఉంటాయి. మాంసం తినరు, మద్యం ముట్టరు. దీంతో అభ్యర్థులకు దేవుని రూపంలో కొంత కలిసివచ్చిందనే చెప్పవచ్చు.

అప్పులు చేసి...

సర్పంచ్‌గా నిలబడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆశిస్తుంటారు. ఈ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండానే ఖర్చు చేసి అప్పుల పాలైన ఘటనలు అనేకంగా ఉన్నాయి. బరిలో దిగిన తర్వాత ఎంత మేరకు అయినా ఖర్చు చేయాల్సిన అవసరం రావడంతో కొందరు భూములు అమ్ముకోగా, మరికొందరు తమ భార్య పుస్తెమెట్టెలు, బంగారం సైతం అమ్ముకుని పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే గ్రామాల్లో రాజకీయాలు వేరేగా ఉంటాయి. ఒకవైపునే ఉంటూ మరో వైపునకు ప్రచారం చేస్తూ, ఇరువైపులా అందిన కాడికి దోచుకుంటారు.

పల్లెల్లో సందడి

సర్పంచ్‌ ఎన్నికలు రావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా రచ్చబండలపై చర్చ సాగుతోంది. అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని కొంత మంది వ్యక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, డబ్బు పలుకుబడి ఉన్న వారిదే ప్రతిసారి పైచేయి అవుతుంది. దీంతో గ్రామాల్లో చాలా వరకు అభివృద్ధి లేకుండా పోతోంది. చాలా డబ్బులు ఖర్చు చేసుకుని పదవి కై వసం చేసుకున్న అనంతరం ఐదేళ్లలో ఖర్చు చేసినంత సైతం లాభం పొందలేకపోతారు. దీంతో అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న గ్రామపంచాయతీల్లో అయితే అతితక్కువగా పనులు ఉంటాయి. ఇప్పటికై నా పోటీచేసే అభ్యర్థులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు భరించేదెలా..?

డబ్బు సర్దుబాటు కోసం తిప్పలు

అభ్యర్థుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement