కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. జయంతి సందర్భంగా ఆలయ సింహద్వారం, గోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ మాల విరమణకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, నిజా మాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీక్ష విరమణ మండపం, కోనేరు, క్యూలైన్లు, లడ్డూప్రసాదం వద్ద ఇబ్బందులు తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేశారు. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఘాట్ రోడ్డు వెంట భక్తులకు కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కొండపైన వైద్య బందాన్ని అందుబాటులో ఉంచారు. మెట్లదారిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
పటిష్ట బందోబస్తు
హనుమాన్ చిన్న జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మల్యాల క్రాస్ రోడ్‌లోని కన్వెన్షన్ హాల్‌లో పోలీసు సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. 914 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నేరాలకు తావులేకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓపికతో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మాలవిరమణ వద్ద భక్తులు క్యూలైన్ పాటించేలా చూడాలని, ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని పేర్కొన్నారు. కాలినడకన వచ్చే భక్తులు వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, వెంకటరమణ, ఎస్‌బీ అరీఫ్ అలీఖాన్, సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి, సురేశ్, అనిల్, రిజర్వ్ ఇన్స్‌స్టెక్లర్లు సైదులు, కిరణ్‌కుమార్, వేణు, వివిధ జిల్లాల సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


