జగిత్యాలరూరల్: భారీ ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోమవారం అర్ధరాత్రి నుంచి బలమైన గాలులు వీయడంతో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. కోత దశకు చేరిన వరి నేలవాలింది. జగిత్యాలరూరల్ మండలంలో మామిడి, మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయింది.
నువ్వు పంటకు నష్టం
కథలాపూర్: మండలకేంద్రంతోపాటు భూషణరావుపేట, సిరికొండ, కలిగోట, అంబారిపేట, తాండ్య్రాల, తక్కళ్లపల్లి గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వుల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలను ఏవో యోగితా, ఏఈవోలు హరీశ్, శేఖర్ పరిశీలించారు. సుమారు 500 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
రాయికల్‌లో ఈదురుగాలులు
రాయికల్: పట్టణంతోపాటు మండలం వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచే ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న, మామిడి నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నేలకొరిగిన పంటలు
బుగ్గారం: మండలంలోని యశ్వంతరావుపేట, గంగాపూర్, శెకెల్ల, వెల్గొండ, గోపులాపూర్ గ్రామాల్లో మొక్కజొన్న, వరి నేలకొరిగాయి.
కోరుట్లలో 1820 ఎకరాల్లో మామిడికి నష్టం
ఇబ్రహీంపట్నం/కోరుట్లరూరల్: ఈదురుగాలులు, వర్షంతో కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో 1820 ఎకరాల్లో మామిడి నేలరాలిందని ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. నేలరాలిన మామిడి పంటలను మంగళవారం పరిశీలించారు. కోరుట్లలో 510 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 150, మల్లాపూర్‌లో 840, మెట్‌పల్లిలో 320 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట హెచ్‌ఈవో శ్రీలత, రైతులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి వర్షం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసిపోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
పెగడపల్లిలో ఈదురుగాలులు
పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు రాలాయి. అరవెల్లి, రాజరాంపల్లి గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. మామిడి తోటలను ఉద్యానశాఖ ఏఈవో అనిల్, మొక్కజొన్న, వరిని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం అంచనా వేశారు.


