జగిత్యాలటౌన్: మహిళల భాగస్వామ్యంతో ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం అవుతోందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు రూ.10వేల కోట్లు ఆదా చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. బస్టాండ్‌లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే మహిళలను సన్మానించారు. డిపో మేనేజర్ కల్పన, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ ఇళ్లను పూర్తి చేయాలి
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన చోట వేగం పెంచాలన్నారు. ఆర్థిక సమస్యలుంటే స్వశక్తి సంఘాల నుంచి రుణం పొందాలని సూచించారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. గోదాములు పరిశీలించి, యాసంగి ధాన్యం నిల్వకు అనువుగా ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు.
క్షయ నివారణలో జిల్లాకు మూడోస్థానం
జగిత్యాల:క్షయ నివారణలో జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాతను అభినందించి అవార్డు అందించారు. వైద్యసేవలు మరింత మెరుగుపర్చేలా చూడాలని ఆదేశించారు. రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


