
అభిప్రాయం గోప్యం!
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు రహస్య సమావేశం హోటల్‌లో నేతలతో ఏఐసీసీ పరిశీలకుల భేటీ మొన్నటి డీసీసీ కార్యాలయ రభసతో రూటు మార్చిన పార్టీ ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ, త్వరలో అధిష్టానానికి నివేదిక
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సంస్థాగత ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారంతో ముగిసింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకొన్న రభసతో పరిశీలకులు రూటు మార్చారు. ఓ హోటల్‌లో రహస్యంగా అభిప్రాయాలను సేకరించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష, కరీంనగర్, రామగుండం సిటీ అధ్యక్ష స్థానాల ఆశావహుల నుంచి చివరిరోజు అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో, నివేదికను అధిష్టానానికి అందించనున్నారు.
ఆరు రోజులుగా...
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న శ్రీపార్టీశ్రేణుల అభిప్రాయాల మేరకే ఎంపికశ్రీ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టింది. ఏఐసీసీ పరిశీలకుడిగా శ్రీనివాస్ మన్నె, పీసీసీ నుంచి ఆత్రం సుగుణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖాజాఫకృద్దీన్‌ను నియమించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులను కలిసి ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో తెలుసుకున్నారు.
రూటు మార్చి
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆశావహుల ఆధిపత్యపోరు రసాభాసకు దారితీయడం తెలిసిందే. నాయకుల నడుమ వాగ్వాదాలు, పాత, కొత్త నేతల పంచాయతీ, పోటాపోటీగా జనసమీకరణ, ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభిప్రాయాలు చేపట్టకుండానే పరిశీలకుడు వెనుదిరగాల్సి వచ్చింది. కరీంనగర్ అనుభవంతో, పరిశీలకులు రూటు మార్చారు. శుక్ర, శనివారాల్లో రహస్యంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష స్థానాలకు పోటీపడుతున్న నాయకులు, పార్టీ పదవులున్న నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులను పిలిచి అభిప్రాయలు సేకరించారు. శనివారం ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కూడా కరీంనగర్‌లోని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు.
డీసీసీ, నగర అధ్యక్ష స్థానాలకు
వచ్చిన దరఖాస్తులు
కరీంనగర్
38
జగిత్యాల
36
రాజన్న సిరిసిల్ల
16
పెద్దపల్లి
25
కరీంనగర్ సిటీ
24
రామగుండం సిటీ
05
ఎన్ని రోజులకో
ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు త్వరలో అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు, రెండు నగర అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ జరగగా, పరిశీలకులు ఇచ్చే నివేదికపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశముంది. పార్టీ పదవులు ఉన్న వారి నుంచి ఎక్కువగా అభిప్రాయాలు సేకరించడంతో, ఆ అభిప్రాయాలు పాత నాయకులకు అనుకూలమనే ప్రచారం ఉంది. నివేదికను అధిష్టానానికి ఎప్పుడు ఇస్తారు, డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారో, ఈ మొత్తం ప్రక్రియ ఇంకెన్ని రోజులు పడుతుందో అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొంటారా, సామాజిక, ఆర్థిక సమీకరణల కారణంగా నియామకాలు చేపడుతారో వేచి చూడాలి.