
ధాన్యం కొనుగోళ్లకు సర్వంసిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్‌లో పండించిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సన్న ధాన్యాన్ని కూడా కొనేందుకు ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించనున్నారు.
421 కేంద్రాలు
ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో 283 కేంద్రాలు, మహిళా సంఘాల(ఐకేపీ) ఆధ్వర్యంలో 137, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రం ప్రారంభించనున్నారు. యాసంగిలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా వానాకాలం సీజన్‌లో చర్యలు తీసుకోనున్నారు. ఏ గ్రేడ్‌ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389, కామన్ రకానికి రూ.2369 చొప్పున కొననున్నారు.
3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈ వానాకాలం జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1.26 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగవుతోంది. బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. 1.89 లక్షల ఎకరాల్లో సాగైన దొడ్డురకానికి ఈసారి తెగుళ్లు, పురుగుల బెడద లేకపోవడంతో ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ లెక్కన దొడ్డురకం 47.025 లక్షల క్వింటాళ్లు, సన్నాలు 31.50 లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత సివిల్ సప్‌లై, డీఆర్‌డీఏ, సింగిల్ విండో, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. గన్నీసంచులకు కొరత లేకుండా సివిల్‌సప్‌లై, ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ట్రాన్స్‌పోర్ట్ యజమానులను ఆదేశించారు. బస్తాకు రెండు కిలోల వరకు కోత విధించడంపై ఇప్పటికే రైతులు ఆగ్రహంతో ఉన్నందున.. ఈసారి అలా జరగకుండా చూడాలని రైస్‌మిల్లర్లను ఆదేశించారు.