మెడికల్‌ షాపులపై నిఘా | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపులపై నిఘా

Oct 10 2025 5:56 AM | Updated on Oct 10 2025 5:56 AM

మెడికల్‌ షాపులపై నిఘా

మెడికల్‌ షాపులపై నిఘా

నిబంధనలు పాటించకుంటే చర్యలు

ఇష్టారీతిలో షాపుల నిర్వహణ

మందుల చీటి లేకుండానే విక్రయాలు

ఇటీవల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న అధికారులు

జగిత్యాల: జిల్లాలోని మెడికల్‌ షాపులపై డ్రగ్‌ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో దగ్గు సిరప్‌ వాడటంతో చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్‌ మందులచీటి లేకుండా ఎలాంటి మందులు ఇవ్వొద్దని, అలాగే రెండేళ్లలోపు చిన్నారులకు ఎలాంటి సిరప్‌లు ఇవ్వొద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. దీంతో మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తున్న మందులపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు.

మందులచీటి లేకుండానే..

మెడికల్‌షాపుల నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. వైద్యుల మందులచీటి లేకుండానే మందులు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేసిన మందులకు రశీదులు ఇవ్వాల్సిండగా కొన్నిషాపుల్లో పాటించడం లేదు. జిల్లాలో 800కు పైగా మెడికల్‌ షాపులు, 100కు పైగా ఏజెన్సీలు ఉంటాయి. జనరిక్‌ మందులను కూడా బ్రాండెడ్‌ మందుల రేట్లకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీటిని అంటగడుతున్నారు. డ్రగ్‌ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిబంధనలు హుష్‌కాక్‌

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్‌ షాపులను లైసెన్స్‌ దారుడైన ఫార్మాసిస్ట్‌ నిర్వహించాలి. కానీ, చాలా దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌లే కన్పించరు. అమ్మకాలకు సంబంధించి రశీదులు, ప్రిస్కిప్షన్‌ నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క మెడికల్‌షాపుల్లోనూ ఇవి అమలు చేయరు. ఫిజిషియన్‌లు ఇచ్చే షాంపిల్‌ మందులు, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను విక్రయించరాదు. కానీ జగిత్యాలలోని కొన్ని మెడికల్‌ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సూచించిన మందులే విక్రయించాలి. మెడికల్‌ షాపునకు వచ్చిన ఏ కొనుగోలుదారుకై నా మందులను ఇవ్వరాదు. కాగా పలు షాపుల్లో ఇవేమీ పట్టించుకోవం లేదు.

గల్లీకో మెడికల్‌షాపు

జిల్లా కేంద్రంలో గల్లీకో మెడికల్‌షాపు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మెడికల్‌ షాపులను అనువైన స్థలం ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని చోట్ల రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మెడికల్‌ మందులతో పాటు, ఇతరత్ర వస్తువులను అమ్ముతున్నారు. రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తే వేసవికాలంలో మందులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ నిబంధనలను పాటించడం లేదు. రేకులషెడ్లలో ఆస్పత్రులు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ స్థలం ఉంటే అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

మెడికల్‌ షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేనిది మందులు ఇవ్వరాదు. మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం. షాంపిల్స్‌ విక్రయించరాదు. తప్పకుండా రికార్డులు నమోదు చేయాలి.

– ఉపేందర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement