
వేధించినందుకే యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఈనెల 27న ఎదురుగట్ల సతీశ్ (28) హత్యకు గురైన విషయం తెల్సిందే. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీశ్ వేధించినందుకే యువతి బంధువులు హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేచపల్లికి సతీశ్ 20రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తన ప్రేమికురాలని, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 27న రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సతీశ్‌ను బయటకు తీసుకొచ్చి కారంపొడి చల్లి కర్రలతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను అదే గ్రామానికి చెందిన నాంతారి వినాజీ, నాంతారి శాంత, జలగా గుర్తించామని, సోమవారం 10 గంటల ప్రాంతంలో రేచపల్లిలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మైనర్ పరారీలో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి రక్తపు మరకల దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీతను అభినందించారు.
పరారీలో మైనర్
డీఎస్పీ రఘుచందర్ వెల్లడి