
చెత్త కుప్పల్లో ఫోర్టిఫైడ్ రైస్
వెల్గటూర్: ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మండలకేంద్రంలోని పెద్దవాగు పక్కన చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు 50కి పైగా ఫోర్టిఫైడ్ రైస్ సంచులను పడేసి వెళ్లారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్‌లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం మిల్లర్లకు ఫోర్టిఫైడ్ రైస్‌ను ప్రభుత్వమే అందిస్తుంది. బియ్యాన్ని మూడు నెలలవరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ శేఖర్‌ను వివరణ కోరగా.. గడువు ముగిసిన బియ్యాన్ని ఎవరో మిల్లర్లు ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, బియ్యం బహిరంగ ప్రదేశంలో పడేయడం ద్వారా పశువులు, ఇతర జీవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, జేసీబీతో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టామని తెలిపారు.