
ఇంటర్ ఎస్జీఎఫ్‌లో గందరగోళం
కరీంనగర్‌స్పోర్ట్స్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 60కి పైగా క్రీడాంశాల్లో పోటీలుంటాయి. అండర్–19 కళాశాలలస్థాయి పోటీల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖ ఎస్జీఎఫ్ కళాశాల కార్యదర్శిని నియమించడం ఆనవాయితీ. కానీ మూడేళ్లకాలంలో ఇంటర్ విద్యాశాఖ విచిత్ర ధోరణిలో అవలంబిస్తోంది. కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లను కాదని పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లకు అండర్–19 బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో గడిచిన నెల వ్యవధిలో ఇంటర్ విద్యాశాఖ అధికారి గంగాధర్ అండర్–19లో ఇద్దరు కార్యదర్శులను అనూప్‌రెడ్డి(కొడిమ్యాల మోడల్ స్కూల్ పీడీ), మధు జాన్సన్ (ఆర్ట్స్ కళాశాల పీడీ)లను నియమించి, తరువాత తొలగించారు. తాజాగా పాఠశాలల అండర్–14,17 కార్యదర్శి వేణుగోపాల్‌కు అండర్–19 బాధ్యతలు అప్పగించారు.
2023– 24లో ఇలా..
ఇంటర్ విద్యాశాఖ తొలిసారిగా 2023–24 ఏడాదికి అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శిగా అప్పటి పాఠశాల ల ఎస్జీఎఫ్ కార్యదర్శిని నియమించింది. పలు కారణాలతో అండర్–14,17 బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇంటర్ విద్యాశాఖ అధికారి సైతం అ ండర్–19 బాధ్యతలనుంచి తప్పించారు. 2025– 26 విద్యాసంవత్సరానికి గాను అండర్ 14,17 కార్యదర్శికి అండర్–19 బాధ్యతలు అప్పగించారు.
మాకివ్వండని మొరపెట్టుకున్నా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఒకరు, గురుకుల కళాశాలల్లో 10మందికిపైగా పీడీలుగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనీయర్ పీడీని కార్యదర్శిగా నియమించాలి. ఒక్కరే ఉండడంతో అతనికే బాధ్యతలిచ్చారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ క్రీడాపోటీల నిర్వహణకు ఔట్ సోర్సింగ్ పీడీగా పనిచేస్తున్న అనూప్‌రెడ్డిని ఇంటర్ విద్యాధికారి నియమించారు. దీంతో గురుకుల కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ పీడీలు అండర్–19 బాధ్యతలను తమకివ్వాలని డీఐఈవో గంగాధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీంతో అనూప్‌రెడ్డి స్థానంలో మధుజాన్సన్‌ను నియమించారు. మధుజాన్సన్‌కు పక్కనపెట్టి వేణుగోపాల్‌ను నియమించారు. సంగారెడ్డి, జనగాంతో పాటు పలుజిల్లాల్లో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శులుగా గురుకుల కళాశాల పీడీలు కొనసాగుతుండగా కరీంనగర్‌లో గురుకుల కళాశాలల పీడీలను పక్కన పెట్టడంపై పలువురు క్రీడారంగ బాధ్యులు ఆందోళనకు గురైయ్యారు. ఉమ్మడి జిల్లాలోని తమను కాదని పాఠశాల కార్యదర్శికి క్రీడాపోటీల నిర్వహణను అప్పగించడంలో అంతర్యమేంటోనని పలువురు పీడీలు అనుకుంటున్నారు. దీనివల్ల అండర్–19 క్రీడల్లో కళాశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చక్రం తిప్పుతున్న కార్యాలయ సిబ్బంది?
కళాశాల పీడీని కాదని పాఠశాల పీడీలకు అండర్–19 బాధ్యతలు అప్పజెప్పడంలో ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023–24, 2025–26 విద్యా సంవత్సరాల్లో పాఠశాల కార్యదర్శికి, ఔట్‌సోర్సింగ్ పీడీకి కార్యదర్శిగా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ఇప్పటికే ఇద్దరు కార్యదర్శులను మార్చిన వైనం
కొత్తగా పాఠశాలల కార్యదర్శికి అండర్– 19 బాధ్యతలు
పక్క జిల్లాల్లో ఒక రూల్... కరీంనగర్‌లో మరో రూల్
ఎస్జీఎఫ్ క్రీడల్లో ఇంటర్ విద్యార్థులు నష్టపోతారంటున్న పీడీలు

ఇంటర్ ఎస్జీఎఫ్‌లో గందరగోళం