
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సులు
మంథనిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు అదుపుతప్పాయి. ఒక ఘటనలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు..
మంథని మండలం వెంకటాపూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంథని మండలం ఆరెంద గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో వెంకటాపూర్ సమీపంలోని రహదారిపై ఏర్పడిన గుంతలో పడగా పట్టీలు విరిగి అదుపుతప్పింది. దీంతో పక్కకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 36మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో మంథనికి తరలించారు.
కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన బస్సు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాట్నపల్లి గ్రామానికి చెందిన రాజయ్య రోడ్డు పక్క నుంచి గొర్రెలను తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరు గొర్రెలు మృత్యువాత పడగా, మరోరెండు గాయాలపాలయ్యాయి. మృతిచెందిన వాటి విలువ సుమారు రూ.1లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
వెంకటాపూర్‌లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన వైనం
ఆరు గొర్రెలు మృత్యువాత.. గాయపడిన మరోరెండు