
పరికరాలు.. పాత సామాన్లకే?
కోరుట్ల:
జగిత్యాల జిల్లాలో తీపి సిరులు పండించి రైతులను మురిపించిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో మూసివేత ఫలితంగా యంత్ర పరికరాలు పనికిరాని తుప్పుగా మారిపోయాయి. శుక్రవారం ముత్యంపేట ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాలంటే కొత్త టెక్నాలజీతో కూడిన మిషన్లు వినియోగించాలని తేటతెల్లమైంది. ఈ సారి జపాన్ టెక్నాలజీ మిషనరీ వాడే అవకాశముంది.
పదేళ్లుగా మూసివేత
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి 2015లో లేఆఫ్ ప్రకటించి మూసివేశారు. ఆ తర్వాతకాలంలో ఫ్యాక్టరీలోని కీలకమైన యంత్ర పరికరాలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఫ్యాక్టరీ మూసివేసిన నాటి నుంచి శుక్రవారం పునరుద్ధరణ కమిటి వచ్చి పరిశీలించే వరకు మిషనరీలో చేరుకున్న బూజు, చెత్త చెదారం, నీరు నిలిచిన ఫలితంగా యంత్ర పరికరాలు తప్పుపట్టిపోయాయి. చెరుకు క్రషింగ్‌లో కీలకమైన మిల్లింగ్ సెక్షన్ పరికరాలు, బాయిలర్లు, పవర్‌హౌస్, బాయిలింగ్ హౌస్, మొలాసిస్ యూనిట్, షుగర్ డ్రాపింగ్ పరికరాలు, క్రషింగ్ యంత్రాల విడిభాగాలు ఎక్కడిక్కడే తుప్పు పట్టాయి. ఇవీ కనీసం కదిలే పరిస్థితుల్లో లేకపోవడం గమనార్హం. ఫ్యాక్టరీ లోపలి భాగంలో ఉన్న యంత్ర పరికరాల్లో దాదాపు 90శాతం పనిచేయలేని స్థితిలో ఉన్న వైనాన్ని పునరుద్ధరణ కమిటీకి చెందిన పరిశ్రమల విభాగం ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ పరికరాలను అన్నింటిని తొలగించి కొత్త చెరకు క్రషింగ్ టెక్నాలజీకి పరికరాలను బిగించే అవసరం తప్పనిసరని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.