
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి
● మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలుగకుండా అన్నిఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, కుంటల ప్రవేశాల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిళలు బతుకమ్మ ఆడే ప్రతీచోట లైట్స్ బిగించాలని అన్నారు. గుంతలు ఉంటే మట్టితో చదును చేయించాలని సూచించారు. చెరువుల వద్ద గజఈత గాళ్లను అందుబాటులో ఉంచాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. బతుకమ్మ ముగింపు వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలు వివేకానంద మైదానంలో నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు. మున్సిపల్‌కమిషనర్ స్పందన, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత పాల్గొన్నారు.
జనం కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు
మల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా జనం కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం వేంపల్లిలో హెల్త్ సబ్‌సెంటర్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ హయాంలో అమలైన పథకాల్లో కోత పెడుతూ ప్రజలు, రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలమైందన్నారు. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తేనే తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శ గ్రామాలుగా నిలిచి అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. వచ్చేస్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి వాహిని, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ బిట్ల నరేశ్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి