
కనిపించని ‘మార్పు’
● తూతూమంత్రంగా వంద రోజుల ప్రణాళిక
● పకడ్బందీగా అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
● సమస్యలు పరిష్కారం కాక ప్రజలకు తప్పని ఇబ్బందులు
మెట్‌పల్లి: మున్సిపాలిటీలను పరిశుభ్రమైన, ఆరో గ్యవంతమైన వాటిగా తీర్చిదిద్దడమే కాకుండా ఎ లాంటి విపత్తులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించడం కోసం ప్రభుత్వం ఇటీవల వంద రోజు ల ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇందులోభాగంగా ప్రతి రోజు ‘ఒక చర్య.. ఒక మార్పు’ అనే నినాదంతో దీనికి శ్రీకారం చుట్టింది. ఎంతో మంచి ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మెట్‌పల్లి పట్టణంలో అధికారులు తూతూమంత్రంగా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పకడ్బందీగా అమలు చేసి ఉంటే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి. కానీ అధికారులు అలా చేయకపోవడం వల్ల ఎటువంటి ‘మార్పు’ లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రణాళికలో 50 అంశాలు..
● మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళికను జూన్ 2న ప్రారంభించి, ఈనెల 10న ముగించింది.
● ఇందులో సుమారు 50 అంశాలను పొందుపర్చింది. వీటిని పకడ్బందీగా అమలు చేయడం కోసం మున్సిపల్ సిబ్బందే కాకుండా వివిధ వర్గాలను భాగస్వాములుగా చేయాలని సూచించింది.
● ప్రధానంగా ప్రజావసరాలైనా డ్రైనేజీలు, నాలాల్లో పూడిక తొలగించడం..అంతర్గత రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తీసివేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, పబ్లిక్ టాయిలెట్ల సమస్యలు పరిష్కరించడం, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం, మంచినీటి వనరులను శుద్ది చేయడం వంటివి ఉన్నాయి.
చిత్తశుద్ధి చూపని అధికారులు
● వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఏయే పనులు చేపట్టాలన్నది ఉన్నతాధికారులు నిర్దేశించారు.
● మెట్‌పల్లి పట్టణంలో అధికారులు వీటిని సక్రమంగా అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. దీనివల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● చాలా కాలనీల్లో రోడ్లపై గుంతలను పూడ్చకుండా, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించకుండా అలాగే వదిలేశారు. ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించలేదు.
● వీటితో పాటు పలుచోట్ల మూతబడ్డ పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించలేదు.
● ఇలా అనేక సమస్యలపై దృష్టి సారించకుండా నామమాత్రంగా చేపట్టి.. ముగించారు.
● స్థానికంగా సమస్యలు ఎక్కువగా ఉన్న శివారు కాలనీలకు చాలాకాలంగా అధికారులు రావడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
● ప్రస్తుతం కౌన్సిలర్లు లేకపోవడం..మరోవైపు అధికారులు రాకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆయా కాలనీలవాసులు నానా అవస్థలు పడుతున్నారు.
● వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంతోనైనా తమ కాలనీల్లో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన వారికి అధికారుల తీరుతో నిరాశే మిగలడం గమనార్హం.
పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తున్న ఈ డ్రైనేజీ మెట్‌పల్లి బల్దియాలోని 12 వార్డులోనిది. పట్టణంలో పారిశుధ్యంపై మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో ఈ దృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని నెలలుగా వ్యర్థాలు డ్రైనేజీలో పూడుకపోయినప్పటికీ వాటిని తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఈ ఒక్క చోటే కాదు.. చాలా వీధుల్లో డ్రైనేజీల పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇలాంటి వాటిని గుర్తించి శుభ్రం చేయాలి. అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.