
● రోజంతా వర్షం.. ● రోడ్లన్నీ బురదమయం ● అస్తవ్యస్తంగా ప
జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉద్యోగులు, మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పండుగకావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి వస్తుంటారు. రోడ్లన్నీ బురదమయంగా మారడంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. సద్దుల బతుకమ్మ సమీపించినా.. మున్సిపల్ అధికారులు ఎక్కడా మొరం పోయించలేదు. కనీసం మహిళలు ఆడుకోవడానికీ ఇబ్బందిగా మారింది. రోడ్లు బాగా లేక.. బురదమయం కావడంతో వాహనదారులు, ప్రజలు నడవడానికే అవస్థలు పడ్డారు. సద్దుల పండుగ సందర్భంగా రోడ్ల మరమ్మతు, ఘాట్ల వద్ద ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించినా.. ఇప్పటివరకు పనులు ముందుకుసాగడం లేదు.
అస్తవ్యస్తంగా పారిశుధ్యం
జిల్లా కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలోని పూడికతీత తీయకపోవడం.. తీసినా రోడ్లపైనే ఉంచడం.. వర్షానికి అంతా రోడ్డుపైకి కొట్టుకొచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. కొన్ని చోట్ల డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల నిండి మురికినీరు బయటకు వెళ్లడంలేదు. వర్షానికి డ్రైనేజీలన్నీ నిండి రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుధ్యం మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని విద్యానగర్ ప్రధాన రోడ్డు. వర్షం కురవడంతో పూర్తిగా బురదమయమైంది. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు నుంచి ముప్పారపు ట్యాంక్‌కు వెళ్తుంటారు. బతుకమ్మ పండుగకు కనీసం మొరం పోయకపోవడంతో పూర్తిగా బురదమయంగా మారింది. అధికారులు స్పందించి బతుకమ్మ ఆడుకునే మహిళల కోసం మొరం పోయాలని మహిళలు కోరుతున్నారు.

● రోజంతా వర్షం.. ● రోడ్లన్నీ బురదమయం ● అస్తవ్యస్తంగా ప