
సాదాబైనామాలపై స్పెషల్‌డ్రైవ్
● నిష్పక్షపాతంగా విచారణ ● ఒకే గ్రామంలో 15 మంది జీపీవోలు ● రాయికల్ మండలంలో ప్రయోగం
రాయికల్: సాదాబైనామాల పరిష్కారానికి రాయికల్ తహసీల్దార్ నాగార్జున వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. మండలంలోని ఓ గ్రామాన్ని ఎంచుకుని.. ఆ గ్రామంలో వచ్చిన దరఖాస్తులను విచారణ చేపట్టేందుకు ఏకంగా 15 మంది జీపీవోలను నియమించారు. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూభారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అల్లీపూర్‌లో 441 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఆలూరులో 42, భూపతిపూర్‌లో 248, బోర్నపల్లిలో 80, చింతలూరులో 54, దావన్‌పల్లిలో 56, ధర్మాజీపేటలో 76, ఇటిక్యాలలో 956, కట్కాపూర్‌లో 120, కిష్టంపేటలో 65, కుమ్మరిపల్లిలో 94, మైతాపూర్‌లో 136, మూటపల్లిలో 284, ఒడ్డెలింగాపూర్‌లో 113, రాయికల్ 513, రామాజీపేటలో 102, తాట్లవాయిలో 169, ఉప్పుమడుగులో 27, వస్తాపూర్‌లో 50, వీరాపూర్‌లో 44 చొప్పున మొత్తంగా 3,670 దరఖాస్తులు వచ్చాయి.
ఒకే గ్రామంలో 15 మంది జీపీవోలతో..
2014 జూన్ 2కు ముందు తెల్లకాగితం ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు చేసుకుని.. 20202 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో ఎంతమంది సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత జీపీవోల నుంచి సమాచారం సేకరించారు. వీటిని నిష్పక్షపాతంగా పరిష్కరించే దిశగా తహసీల్దార్ నాగార్జున ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసుకుని.. ఆ గ్రామంలో ముందస్తుగా సమాచారం అందించి.. ప్రజలముందే సాదాబైనామాలపై రెవెన్యూ అధికారులతోపాటు, 15 మంది జీపీవోలతో పరిష్కరించేలా చూస్తున్నారు. ఆయా గ్రామాల్లో తేదీలు ప్రకటించి ఆ మేరకు సాదాబైనామాల సమస్యకు చెక్ పెట్టేందుకు ముందుకు కదులుతున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా ఆ గ్రామానికే రెవెన్యూ అధికారులు, జీపీవోలు వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.