
ఆర్టీసీలో ప్రయాణించండి.. బహుమతి గెలుచుకోండి
జగిత్యాలటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి లక్కీడ్రాలో బహుమతి గెలుచుకోవాలని జగిత్యాల డిపో మేనేజర్ కల్పన ప్రయాణీకులను కోరారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందని, ఈనెల 27నుంచి అక్టోబర్ 6వరకు సెమీ డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు లక్కీడ్రాకు అర్హులని తెలిపారు. ప్రయాణికులు తమ బస్ టికెట్ వెనుక పేరు చిరునామా, ఫోన్ నంబర్ వివరాలు రాసి బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రా బాక్స్‌లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8న కరీంనగర్ రీజనల్ ఆఫీసులో లక్కీడ్రా ఉంటుందని పేర్కొన్నారు. రీజియన్ నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి మీడియా ద్వారా తెలియజేస్తామని వివరించారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు చెక్కు రూపంలో అందిస్తామని తెలిపారు.