
ఫార్మసిస్ట్.. తెరవెనుక వైద్యుడు
కోల్‌సిటీ(రామగుండం): వ్యాధిని గుర్తించి, నివారణకు తగిన మందు సూచించేది డాక్టరు.. మందుల ఎంపిక, మోతాదు, వినియోగించే విధానం తదితర మొత్తం ప్రక్రియపై దిశ, నిర్దేశం చేసేది ఫార్మసిస్ట్.. ఇలా వైద్యులపాత్ర కూడా పోషించేది ఫార్మసిస్టే. పేషెంట్ ఆరోగ్య పరిరక్షణలో వీరే కీలకపాత్ర. ఆరోగ్య సంరక్షణలో వీరు అందిస్తున్న అమూల్య సేవలు, సహకారాన్ని గౌరవించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈఏడాది ‘థింక్ హెల్త్.. థింక్ ఫార్మసిస్ట్’ నినాదం ఎంచుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 4వేల వరకు రిటైల్ మెడికల్ షాపులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా లో 1,500 నుంచి 1,600 వరకు, పెద్దపల్లిలో 700, జగిత్యాలలో 950, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 650 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీటితోపాటు హోల్‌సేల్ దుకాణాలు మరో 200 దాకా ఉన్నాయి. వీటిలో సుమారు 5వేల నుంచి 6వేల మంది వరకు ఫార్మసిస్ట్‌లు సేవలు అందిస్తున్నారు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో తనిఖీలు, కేసులు..
ఉమ్మడి జిల్లాలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు(ఫార్మసీ కోర్సు పూర్తిచేసినవారు) మెడికల్‌షాపుల లైసెన్స్, రెన్యూవల్స్ జారీచేయడంతోపాటు మెడికల్ షాపుల్లో తనిఖీలు, మందుల నాణ్యత పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన మందులను ల్యాబొరేటరికి పరిశీలనకు పంపిస్తున్నారు. నాణ్యతలో లోపం ఉంటే సంబంధిత విక్రయదారు, తయారీదారుపై చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
వైద్యుల తర్వాత ఫార్మసిస్ట్‌దే కీలకపాత్ర..
పేషెంట్లకు వైద్యం అందిచండంలో వైద్యుల తర్వాత ఫార్మసిస్టులే కీలకం. వ్యాధి త్వరగా నయం కావడానికి, మందులను ఎంత మోతాదులో వేసుకోవాలో చెబుతారు. ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి సైతం వివరిస్తూ అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. కొందరు ఫార్మసిస్ట్‌లు మందుల తయారీ కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తుండగా, ఔషధ పరిశోధన, అభివృద్ధి, భద్రతా పరీక్షలకు మరికొందరు సహకరిస్తున్నారు. ఔషధాల్లోని లోపాలను తగ్గించేందుకూ కృషి చేస్తున్నారు.
● వైద్యుల పాత్ర పోషించేది వారే..
● నేడు ప్రపంచ ఫార్మసిస్ట్ డే