సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు అగ్రనేత కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(70) ఎన్‌కౌంటర్‌లో మరణించగా కడసారి చూపుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో సోమవారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన సోదరుడు కరుణాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు మంగళవారం తరలివెళ్లారు. నారాయణపూర్‌లో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీస్ అధికారులు జాప్యం చేయడంతో బుధవారం రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించలేదు. కనీసం తమ్ముడి శవాన్ని కళ్లతో చూసుకుంటానని కరుణాకర్‌రెడ్డి పోలిసులను ప్రాధేయపడినా వారు కనికరించలేదు. కాసేపట్లో శవాన్ని అప్పగిస్తామంటూ రోజంతా కాలయాపన చేశారు. చివరి 45 ఏళ్లుగా ఇంటికి, కంటికి దూరమైన తమ్ముడిని చూసేందుకు కరుణాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని అప్పగిస్తామంటూ బుధవారం రాత్రి వరకు హామీలా పరంపరను పోలీసులు కొనసాగించారు.
నింగినేలా ఏకమై..
నారాయణపూర్‌లో మంగళవారం రాత్రి నుంచి నింగినేలా ఏకమైనట్లు వర్షం కురుస్తూనే ఉంది. నారాయణపూర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద వరదనీరు, బురదతో కలిసి శవాన్ని తరలించేందుకు ప్రతికూలంగా ఉంది. జోరువానతో రోడ్లు బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కడారి సత్యనారాయణరెడ్డి శవంతో గురువారం ఉదయం గోపాల్‌రావుపల్లెకు చేరే అవకాశం ఉంది.
శవం అప్పగింతపై ఆరా..
మావోయిస్టు అగ్రనేత కొస మృతదేహం అప్పగింతపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఆయన చదువుకున్న పెద్దపల్లి, ఉద్యమం బాటపట్టిన బసంత్‌నగర్‌తోపాటు సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ఆరా తీశారు. వివిధ పార్టీల నాయకులు కొసను కడసారి చూసేందుకు స్వగ్రామం గోపాల్‌రావుపల్లెకు వస్తామంటూ మృతదేహం అప్పగింతపై వివరాలు సేకరించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహంతో ఊరు చేరేందుకు కుటుంబ సభ్యులు పడిగాపులు కాసారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): చిన్నతనంలోనే విప్లవబాట పట్టి.. స్వగ్రామమైన గోపాల్‌రావుపల్లెను విడిచి వెళ్లిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాదు ఉద్యమంలోనే అసువులుబాసారు. 45 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్యనారాయణరెడ్డి మళ్లీ చివరిమజిలీ కోసం స్వగ్రామానికి అమరుడై వస్తున్నాడు. స్వగ్రామంలోనే గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో గోపాల్‌రావుపల్లెలోని సత్యనారాయణరెడ్డి ఇంటిని గ్రామస్తులు శుభ్రం చేశారు. ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించారు.
నారాయణపూర్‌లో కుటుంబ సభ్యుల పడిగాపులు
నేడు గోపాలరావుపల్లెకు చేరనున్న మృతదేహం
‘కడారి’ కడచూపునకే నిరీక్షణ