కాసులిస్తే రైట్‌రైట్‌ | - | Sakshi
Sakshi News home page

కాసులిస్తే రైట్‌రైట్‌

Sep 25 2025 7:31 AM | Updated on Sep 25 2025 7:31 AM

కాసుల

కాసులిస్తే రైట్‌రైట్‌

ఇసుక అక్రమార్కులపై రెవెన్యూ ఔదార్యం వసూళ్లకు ప్రైవేటు వ్యక్తుల నియామకం చేతికి మట్టి అంటకుండా డిజిటల్‌ లావాదేవీలు

కోరుట్ల: అనుకున్న రీతిలో కాసులు చేతికి అందితే చాలు ఇసుక అక్రమ రవాణాదారులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. కాదంటే కేసులు.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇదీ కోరుట్ల రెవెన్యూ సిబ్బందిలో కొంతమంది తీరు. మామూళ్ల వసూళ్ల కోసం కొందరు ఏకంగా ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నా.. ఉన్నతాధికారుల దృష్టికి రాకపోవడం మరింత విడ్డూరం. కిందిస్థాయి అధికార యంత్రాంగంపై కరువైన పర్యవేక్షణకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.

అక్రమార్కులపై ఔదార్యం..

అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఒక్కోసారి పగలు..రాత్రి తేడా లేకుండా రెవెన్యూ సిబ్బంది ఇసుక రవాణాను అడ్డుకుని జరిమానా వేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 120 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే కొంతమంది రెవెన్యూ సిబ్బంది కాసులు వసూలు చేస్తూ అక్రమార్కులపై ఎక్కడా లేని ఔదార్యం చూపుతున్నారు. రాత్రి వేళ పట్టుబడిన ఇసుక లారీలు, ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వదిలేస్తున్నారు.

ప్రైవేటు ఏజెంట్లు..

రెవెన్యూకు రెండు కళ్లుగా పనిచేయాల్సిన ఇద్దరు అధికారులు తమ కింద ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్నెళ్ల క్రితం ఓ వ్యక్తిని దళారీగా పెట్టుకుని ఇసుక ట్రాక్టర్లను ఆపి డబ్బులు డిమాండ్‌ చేయించిన వీడియో వైరల్‌ అయింది. నేరుగా డబ్బులు తీసుకుంటే ఏసీబీకి ఎక్కడ చిక్కుతామోనన్న భయంతో నేర్పుగా తాము నియమించుకున్న ఏజెంట్ల ఫోన్‌ పేకు డబ్బులు పంపాలని సూచిస్తున్నారు. 20 రోజుల క్రితం ఓ అధికారి అర్ధరాత్రి వేళ కోరుట్ల పరిఽధిలో ఇసుక లారీలను పట్టుకున్నారు. తమ ప్రైవేటు ఏజెంట్‌ ఫోన్‌కు ఫోన్‌పే చేయించి తరువాత ఇసుక లారీలను వదిలేసిన తీరు పరిస్థితికి అద్దం పడుతోంది. కోరుట్ల, కథలాపూర్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అఽధికారులు ఈ రీతిలో వ్యవహరించడం అక్రమార్కులకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది.

ఓ రెవెన్యూ ఏజంట్‌కు ఫోన్‌పే చేసిన రసీదులు

చర్యలు తీసుకుంటాం

రెవెన్యూ సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.

– కృష్ణ చైతన్య, తహసీల్దార్‌, కోరుట్ల

కాసులిస్తే రైట్‌రైట్‌1
1/1

కాసులిస్తే రైట్‌రైట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement