
టీఎన్జీవోల భూమి ఎక్కడ?
40 ఏళ్లుగా నివాసస్థలం కోసం టీఎన్జీవోల పోరాటం
1980లో బొమ్మకల్‌లో 20ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
స్థానిక నేతల కబ్జాలకు మొత్తం భూమి మాయం
తిరిగి 2017లో తిమ్మాపూర్‌లో 20 ఎకరాలు గుర్తింపు
ప్రొసీడింగ్స్ కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వారంతా విశ్రాంత ఉద్యోగులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వీరికి ఇంటిస్థలం కేటాయించింది. దాన్ని కబ్జాదారులు మాయం చేయగా.. మూడు దశాబ్దాల పోరాటం తరువాత మరో చోట 20ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు నేటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా ముదిమి వయసులో ఇంటిస్థలానికి అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకటి, కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కబ్జాకు గురైన తమ స్థలానికి ప్రత్యామ్నాయం చూపాలంటూ ఈ సీనియర్ సిటీజన్లు చేస్తున్న పోరాటం నేటికీ ఆగడం లేదు. నగర శివారుల్లో టీఎన్జీవోలకు కేటాయించిన స్థలం కబ్జా అయినప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 40ఏళ్లుగా తీరని అన్యాయమే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు.
అసలేం జరిగింది?
1980లో ఉమ్మడి జిల్లాలోని 930మంది టీఎన్జీవోలు కలిసి ఇంటి స్థలాల కోసం హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వీరికి మూడు చోట్ల ఇంటి స్థలాలు కేటాయించారు. తొలుత కరీంనగర్ కమాన్‌రోడ్‌లోని పాతచెరువు సమీపంలో సర్వే నంబరు 415లో 18 ఎకరాలు, ఎర్రగుంట సమీపంలో సర్వే నంబరు 918లో 14 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు స్థలాలను టీఎన్జీవోలకు ప్రభుత్వం స్వాఽ దీనం చేసింది. ఈ స్థలాల్లో 304 మంది టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకున్నారు. మూడోచోటుగా బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 96లో 20ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి తమది అంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ భూమిని కబ్జా చేశారు. దీన్ని స్వాధీ నం చేసుకునేందుకు టీఎన్జీవోలు 2017 వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
తిమ్మాపూర్‌లో చూసినప్పటికీ
బొమ్మకల్‌లో కబ్జా అయిన 20 ఎకరాల విలువైన స్థలం గురించి ఇటు టీఎన్జీవో పెద్దలు, అటు కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా రూ.కోట్లాది విలువైన స్థలం కబ్జాదారుల వశమైంది. దీంతో అప్పటి నుంచి ప్రయత్నించగా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తే కేటాయిస్తామన్నారు. దాదాపు మూడుదశాబ్దాలపాటు అన్వేషించిన టీఎన్జీవోలు చివరికి 2017లో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి సర్వే 502, 522లలో దాదాపు 21 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని గుర్తించి అధికారులకు విన్నవించారు. నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపినా.. ఇంతవరకూ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఎనిమిదేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా నేటికీ న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలాలు రాకుండా మిగిలిన 626 మందిలో దాదాపు 100 మంది మరణించార ని, 200 మందికిపైగా అనారోగ్యంతో మంచా న పడ్డారని, దాదాపు 40 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని సీఎం, కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.