
‘బోనస్’ ఇంకా రాలే..
సన్నాలకు రూ.500 ఇస్తామన్న ప్రభుత్వం
గత యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు
రావాల్సిన డబ్బులు రూ.2.39 కోట్లు
ఎదురుచూస్తున్న అన్నదాతలు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో రైతుల నుంచి సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. రైతులకు ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదు. గత యాసంగిలో క్వింటాల్‌కు కేంద్రం రూ.2,320 చెల్లించింది. ఈ మొత్తానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా.. బోనస్ రాకపోవడంతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సివిల్ సప్‌లై అధికారులు, కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో మొరపెట్టుకుంటూనే ఉన్నారు. నెలలు గడుస్తుండడంతో అసలు బోనస్ ఇస్తుందా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నారు.
47,880 క్వింటాళ్లు సేకరణ
గత యాసంగిలో ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి 47,880 క్వింటాళ్ల సన్నాలు కొనుగోలు చేశారు. తప్ప, తాలు పేరిట క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోలు కట్ చేశారు. కొన్న ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. వాటికి సంబంధించి రూ.500 బోనస్ చొప్పున రైతులకు రూ.2.39 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. 2024 నవంబర్ 16 న తొలిసారి బోనస్ విడుదల చేసిన ప్రభుత్వం.. తర్వాతి సీజన్ నుంచి ఇవ్వడమే లేదు. దీంతో రైతులు బోనస్ కోసం ప్రతి సీజన్‌లోనూ ఎదురుచూస్తున్నారు. కొందరు రైతులైతే ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకుంటున్నారు. యాసంగి సీజన్‌లో కొనుగోళ్లు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా.. బోనస్ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై అన్నదాతలు గుర్రుగా ఉన్నారు. బోనస్ డబ్బుల వివరాలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు వివరాలను సివిల్ సప్‌లై శాఖ ఈ–కుబేర్ యాప్‌కు పంపిస్తే ప్రభుత్వం నుంచి శాఖ ఖాతాలో నిధులు జమ చేయాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం నుంచే డబ్బులు రావడంలేదు. బోనస్ రాని రైతులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. త్వరలో ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

‘బోనస్’ ఇంకా రాలే..