
సమన్వయంలో పోలీసుల పాత్ర అభినందనీయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి
జగిత్యాలజోన్: కక్షిదారుల మధ్య సయోధ్య కుది ర్చి.. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం కావడంలో పోలీసుల పాత్ర అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంలో కీలకపాత్ర పోషించిన పోలీసులను బుధవారం జిల్లా కోర్టులో అభినందించి, సర్టిఫికెట్లు అందించారు. పెండింగ్ కేసుల పరిష్కారం ద్వారా కోర్టులపై భారం తగ్గుతుందన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో భాగంగా కేసుల పరిష్కారానికి ప్రయత్నించామన్నారు. మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ ఇటీవలి లోక్ అదాలత్‌లో మూడు వేలకుపైగా కేసులు పరిష్కరించామన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కక్షిదారుల మధ్య సమన్వయం కుదర్చడంలో ఎస్పీ నుంచి కోర్టు కానిస్టేబుల్ వరకు చొరవ చూపారని తెలిపారు. మొదటి అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు.
22 మంది కోర్టు కానిస్టేబుళ్లకు సన్మానం
లోక్‌అదాలత్‌లో విశేష కృషి చేసిన ఎస్పీ అశోక్, వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన 22 మంది కోర్టు కానిస్టేబుళ్లు, నలుగురు పోలీసు అధికారులను ప్రధాన న్యాయమూర్తి సన్మానించారు. 91 కేసులు పరిష్కరించిన సీఐ కరుణాకర్, 57 కేసులు పరిష్కరించిన కోరుట్ల ఎస్సై చిరంజీవి, 56 కేసులు పరిష్కరించిన రాయికల్ ఎస్సై సుధీర్‌రావు, గొల్లపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్‌ను అభినందించారు.