
వేతనాల కోసం ఎదురుచూపు
పెగడపల్లి: గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సమీపిస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పండుగపూట పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. గ్రామాల్లో వీధులు, మురికి కాల్వలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, మంచినీటి సరఫరా చేయడం వీరి విధి. జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో రూ.9,500 వేతనంపై 1487 మంది పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, పంపు ఆపరేటర్లు, వాటర్‌సప్‌లై, పారిశుధ్య కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా ఒకటిన జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. వచ్చిన వేతనంతో కుటుంబపోషణ, ఇతర అవనసరాలు తీర్చుకునే వారు. అయితే ప్రభుత్వం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సర్కారు స్పందించి వేతనాలు అందించాలని పంచాయతీ సిబ్బంది వేడుకుంటున్నారు.