
ఖాళీ స్థలాలు..మురికి నిలయాలు
కోరుట్ల: ప్రతీరోజు మోస్తరుగా కురుస్తున్న వర్షానికి కోరుట్ల పట్టణంలోని ఖాళీస్థలాల్లో మురికినీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. నీట కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో ఆయా స్థలాల యజమానులు, మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో జనం ఇబ్బందుల పాలవుతున్నారు.
లెక్కలేనన్ని ఖాళీ స్థలాలు
పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని వార్డులతోపాటు పట్టణ నడిబొడ్డున ఉన్న వార్డుల్లోనూ చాలాచోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. 33 వార్డుల్లో కలిపి 390వరకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు అంచనా. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం సమస్యగా మారింది. ఆయా ఖాళీ స్థలాల్లో వర్షాలకు మురికి నీరు నిండిపోతోంది. ఆ నీటిలో దోమలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వర్షం కురుస్తుండడం.. నీరు మురికిగా ఉండడంతో డెంగీకారక దోమలకు ఆలవాలంగా మారుతోంది. ఫలితంగా అన్ని వార్డుల్లో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. శివారు ప్రాంతాలైన హాజీపురా, ఆనంద్‌నగర్, బిలాల్‌పురా, రాంనగర్, అంబేద్కర్ నగర్, అయిలాపూర్ రోడ్ ఏరియాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటి ఫలితంగానే విష జ్వరాలు, సీజనల్ సంబంధిత వ్యాధులు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నివారణ చర్యలు శూన్యం
ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధికాకుండా గతంలో ఆయిల్ బాల్స్, గంబూసియా చేపలను వదిలేవారు. చేపలు, ఆయిల్ బాల్స్ నీటిలో పెరిగే దోమల లార్వాను దెబ్బతీసేవి. కానీ.. ఈ సారి కనీసం ఆయిల్ బాల్స్ కూడా వేయడం లేదు. గంబూసియా చేపల జాడే లేదు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు వాడుతున్న దాఖలాలు లేవు. ఫలితంగా జనాలు జ్వరాలు పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారులు దోమల నివారణకు చర్యలు చేపట్టి సీజనల్ వ్యాధులను ఆరికట్టాల్సిన అవసరముంది.