
రిజర్వేషన్లపై ఫోకస్..!
కలెక్టరేట్‌లో రెండురోజులుగా ప్రక్రియ రిజర్వేషన్ల ఖరారుపై మార్గదర్శకాలు విడుదల బీసీ రిజర్వేషన్లపైనే సర్వత్రా ఆసక్తి
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ కావడంతో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వగా.. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్ల ఖరారుపై మార్గదర్శకాలు విడుదల కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్‌లో రిజర్వేషన్లపై కసరత్తు చేశారు. కలెక్టర్ పూర్తిస్థాయిలో వాటిని పరిశీలించి ఖరారు చేసినట్లు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల కోటా కేటాయించనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ అమలు చేయనుండటంతో దీనిపైనే జిల్లాలో చర్చ కొనసాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారు..?అనే చర్చే ప్రతినోటా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి రిజర్వేషన్ స్థానాలు కేటాయించాలని ఆదేశాలు రావడంతో కలెక్టర్ లు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, కులగణనలో ఉన్న బీసీ జనాభా వివరాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు చేపట్టనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ కేటగిరీలు ఈసారి ఉండవు. మళ్లీ నూతన రిజర్వేషన్లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఆశావహుల్లో దడ
రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. గతంలో ఉన్న రిజర్వేషన్ ఉండదని తెలుస్తుండటంతో ఆశావహుల్లో దడపుడుతోంది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోపాటు, మున్సిపల్ పాలకవర్గం సమయం ముగిసి రెండేళ్లు సమీపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడా నిర్వహిస్తారా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లపై అధికారులు కసరత్తు చేస్తుండటంతో వారిలో సందడి మొదలైంది. జిల్లాలో 6,07,222 మంది ఓటర్లు ఉన్నారు. 385 గ్రామాల్లో 3,536 వార్డులున్నాయి. 20 జెడ్పీటీసీలు, 216 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గతంలో 18 జెడ్పీటీసీలకే ఎన్నికలు జరగగా.. ఈసారి కొత్తగా భీమారం, ఎండపల్లి స్థానాలు పెరిగాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలు కూడా రెండు పెరిగాయి. ఇవి కాక ఐదు మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు.
‘స్థానికం’పై కసరత్తు
రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్లకే..
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల రిజర్వేషన్ల ఖరా రు చేసే బాధ్యత కలెక్టర్లకే ఇచ్చినట్లు తెలిసింది. సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ స్థానిక ఆర్డీవో, వార్డు స భ్యుల రిజర్వేషన్లు మండల ఎంపీడీవోలు చూ స్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయించిన తర్వాతే మిగితా సీట్లు జనరల్‌కు కేటాయిస్తున్నట్లు తెలిసింది.
మొత్తం ఓటర్లు 6,07,222
పురుషులు 2,89,249
మహిళలు 3,17,964
ఇతరులు 9
పంచాయతీలు 385
వార్డులు 3,536
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీటీసీ స్థానాలు 216