
షుగర్ ఫ్యాక్టరీపై చిగురిస్తున్న ఆశలు
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలోగల నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మూతపడిన కర్మాగారాన్ని ఈనెల 26న పరిశ్రమలు, వ్యవసాయశాఖల ఉన్నతాధికారుల బృందం సందర్శించనుంది. బృందం సభ్యులు రైతులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ మేరకు మంగళవారం పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, షుగర్‌కెన్ డైరెక్టర్ సీహెచ్.నర్సిరెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మూతపడి పదేళ్లు..
నష్టాలతో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీకి స్వరాష్ట్రం వచ్చాక ఎన్‌డీఎస్‌ఎల్ యజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఫ్యాక్టరీ 2015 డిసెంబర్ 23న మూసివేశారు. అప్పటికే నష్టాలతో నడుస్తున్న ఫ్యాక్టరీని రైతుల భాగస్వామ్యంతో పునరుద్ధరిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. కొన్ని కారణాలతో ముందడుగు పడలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు పదేళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీల పునరుద్ధరణ.. చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడం.. టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతుధర కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది ఫిబ్రవరిలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో పునరుద్ధరణ కమిటీ బృందాన్ని నియమించింది. ఆ బృందం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించింది.
తెరుచుకునేనా..?
షుగర్ ఫ్యాక్టరీని పరిశ్రమలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల బృందం సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత చెరుకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెల 26న ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిప్రాయం చెప్పేందుకు చెరుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లింపు, చెరుకు క్రషింగ్ బకాయిల చెల్లింపు, హార్వెస్టింగ్ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలో నడిపించినా.. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా.. భవిష్యత్తులో ఫ్యాక్టరీని తరలించడంగానీ.. మూసివేయడంగానీ చేయొద్దని డిమాండ్ చేయనున్నారు.
26న ఏర్పాట్లు చేయండి..
జగిత్యాలఅగ్రికల్చర్: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరుకు రైతులతో ఈనెల 26న వ్యవసా య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు స్పెషల్ చీ ఫ్ సెక్రటరిలు సంజయ్‌కుమార్, రఘునందన్‌రావు కలెక్టర్, ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులు సమన్వయంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి, వ్యవసాయాధికారి భాస్కర్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, అసిస్టెంట్ చెరుకు కమిషనర్ వెంకటరవి పాల్గొన్నారు.