
చక్కెర ఫ్యాక్టరీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం
మెట్‌పల్లి: చెరుకు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఫ్యాక్టరీ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రైవేట్ యాజమాన్యం తీసుకున్న అప్పులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రభుత్వం వాటికి రూ.172కోట్లు చెల్లించిందన్నారు. గతంలో ఫ్యాక్టరీ నడిచే సమయంలో 20వేల ఎకరాల్లో పంట సాగు చేశారని, తిరిగి దానిని పునఃప్రారంభించాలంటే కనీసం 10వేల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈనెల 26న ముత్యంపేటలో పరిశ్రమలు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పర్యటించే అవకాశముందన్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్నతోపాటు సన్నరకం ధాన్యాన్ని రైతులు భారీగా సాగు చేశారని, ప్రభుత్వం జాప్యం చేయకుండా వచ్చే నెలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ధర్మపురి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు, నాయకులు అల్లూరి మహేందర్‌రెడ్డి, ఎలాల జలపతిరెడ్డి, కొంతం రాజు, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు.