
ఆరుతడి అంతంతే..
వరి పంట వైపే రైతన్న
అత్యధికంగా 3.15 లక్షల ఎకరాల్లో సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల లెక్క తేలింది. వ్యవసాయాధికారులు గ్రామాల వారీగా సేకరించిన లెక్కల ప్రకారం వరిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుతడి పంటలను అంతంతమాత్రంగానే సాగు చేశారు. జిల్లాలో పుష్కలమైన సాగునీటి వనరులకు తోడు పొలం దున్నేందుకు ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, నాట్లు వేసేందుకు బీహార్ కూలీలు, పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావడం.. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389కు చేరడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారాయి.
3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు
రైతులు వానాకాలం సీజన్‌లో వరి పంట వైపే మొగ్గు చూపారు. జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్‌లో 3.10లక్షల ఎకరాల్లో సాగు కాగా.. ఈ వానాకాలం సీజన్‌లో మరో 5వేల ఎకరాలకు పెరిగి, 3.15 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఆయా మండలాల్లో మిగతా ఆరుతడి, ఉద్యానపంటలను అంతంతమాత్రంగానే సాగు చేశారు. మిగతా పంటలతో పోల్చితే వరికి ప్రభుత్వ మద్దతు ధర ఉండటం.. గ్రామాల్లోనే కొనుగోలు చేసే వెసులుబాటు ఉండటం, సాగు నీరు పుష్కలంగా ఉంది. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని మూసివేయడంతో చెరుకు రైతులు కూడా వరి వైపే దృష్టి సారించారు. ఈ సారి యూరియా కొరత కారణంగా సకాలంలో పంటకు వేయకపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆరుతడి పంటలు అంతంతే..
పప్పుదినుసులు, నూనెగింజలు, వాణిజ్య పంటలను దాదాపు 62 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న 32,463ఎకరాలు, పత్తి 16,393, సోయాబీన్ 809, కంది 976, పెసర 265, మినుము 21, చెరుకు 702, అనుములు 240, పసుపు 10,144, కూరగాయలు 373, మిర్చి 365, అలసంద 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వేరుశెనగ, నువ్వు, పొద్దుతిరుగుడు వంటి నూనె పంటలను పూర్తిగా తగ్గించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పంటలన్నీ నీళ్లలో మునిగాయి. భూమిలో తేమ ఎక్కువగా ఉండటంతో మొక్కలు గిడసబారి ఎండిపోయాయి. మొక్కజొన్నను పీచు దశ నుంచి కంకి దశ వరకు ఓ వైపు అడవిపందులు, మరోవైపు కోతులు, రామచిలుకలు ధ్వంసం చేయడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలు మార్కెట్‌కు వచ్చే వరకు ఏ రేటు ఉంటుందో తెలియని పరిస్థితి ఉండడం.. ఆరుతడి పంటల సాగు అధిక శ్రమతో కూడుకున్నది కావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు.