
పండుగకు ఊరెళ్తున్నారా..!
తాళాలు వేయడం మర్చిపోవద్దు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దు అనుమానితులు కనిపిస్తే 100కు కాల్ చేయండి 24 గంటలూ అందుబాటులో.. ఎస్పీ అశోక్‌కుమార్
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు వచ్చాయి. పట్టణాల్లో ఉంటున్న వారంతా పిల్లాపాపలతో సొంతిళ్లకు బయల్దేరుతున్నారు. అయితే ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులు ఉంచొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఇంకా ఆయన మాటల్లోనే..
జగిత్యాలక్రైం: సెలవులు రావడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి విహారయాత్రలు, స్వస్థలాలకు వెళ్తున్నారు. అలాంటివారు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దు. వెంట తీసుకెళ్లాలి.. లేదా బంధువుల వద్ద భద్రపర్చుకోవాలి. లేదా బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి. ఇంటి ఇరుగుపొరుగు వారికి తప్పనిసరిగా సమాచారం అందించాలి. స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతాం. ఇప్పటికే పోలీస్‌శాఖ తరఫున రాత్రివేళల్లో నిఘా పెంచాం. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. నేరాలు నియంత్రణకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. పండుగ సీజన్ కావడంతో వివిధ వస్తువులను అమ్మకం పేరిట ఇళ్ల వెంబడి తిరిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మాటలతో మభ్యపెట్టి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. చైన్‌స్నాచర్లు వృద్ధులను టార్గెట్‌ను చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు బంగారు ఆభరణాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు వేసుకుని మాటల్లో దింపుతున్నట్లు అనిపిస్తే అప్రమత్తం కావాలి. మాస్క్‌లు వేసుకున్న వారు అనుమానితులైతే స్థానికులు వెంటనే వారిని ఆపి వివరాలు అడగాలి.
సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు
కొంతమంది అపరిచితులు సోషల్ మీడియాలో పెట్టే వదంతులు నమ్మవద్దు. ఎవరైనా రెచ్చగొట్టేలా.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోస్టులు పెడితే పోలీసులకు సమాచారం అందించాలి. సోషల్ మీడియాపై కూడా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకునేలా పోలీసు శాఖ కృషి చేస్తుంది.
రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం
దసరా, బతుకమ్మ, దుర్గా నవరాత్రోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశాం. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు బృందాలుగా ఏర్పడి బందోబస్తు పెంచుతున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా స్థానికులు వెంటనే 100 డయల్‌కు కాల్‌చేస్తే స్థానిక పోలీసులు అప్రమత్తమై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు.