హద్దు మీరుతున్న ఆర్‌ఎంపీ వైద్యం | - | Sakshi
Sakshi News home page

హద్దు మీరుతున్న ఆర్‌ఎంపీ వైద్యం

Sep 22 2025 7:04 AM | Updated on Sep 22 2025 7:04 AM

హద్దు మీరుతున్న ఆర్‌ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్‌ఎంపీ వైద్యం

కొడిమ్యాల: జిల్లాలో ఆర్‌ఎంపీల వైద్యం హద్దు మీరుతోంది. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీలు ప్రొఫెషనల్‌ వైద్యుల మాదిరిగా చికిత్స ఇస్తున్నారు. మెడిసిన్‌ చదివిన వారు ఇస్తున్న మందు గోళీల కంటే కొందరు ఆర్‌ఎంపీలు ఇస్తున్న యాంటీబయోటిక్సే ఎక్కువ. వీరిపై ప్రజలకు ఉన్న గుడ్డి నమ్మకమే కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. జ్వరం వచ్చినా.. అనారోగ్యం పాలైనా రెండు ఇంజక్షన్లు వేసి.. అవసరం లేకున్నా సైలెన్లతోపాటు యాంటీబయోటిక్స్‌ అంటగట్టి అందినకాడికి లాగుతున్నారు. కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్‌ఎంపీలు నర్సింగ్‌ హోం తరహాలో బెడ్లు వేసి మరి ట్రీట్మెంట్‌ చేస్తున్నారు.

విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వినియోగం

గతంలో వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స కేంద్రాలలో తనిఖీలు చేసి పరిమితికి మించి అధిక డోస్‌ ఇస్తున్న కొన్ని కేంద్రాలను గుర్తించి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా మారని కొందరు ఆర్‌ఎంపీలు యాంటీబయోటిక్స్‌తో పాటు స్టెరాయిడ్స్‌ వంటి వాటిని రోగులకు ఇస్తున్నారు. స్పెషలైజేషన్‌ చేసి అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను గ్రామాల్లో ఆర్‌ఎంపీలు రెఫర్‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఆర్‌ఎంపీలు అర్హత లేకున్న ప్రిస్క్రిప్షన్‌ రాయడంతోపాటు ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆర్‌ఎంపీల వద్దకు వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందులు భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు పీఎంపీలు క్లినిక్‌కు అనుబంధంగా మెడికల్‌ షాపులు, పాథాలజీ లాబ్స్‌ నిర్వహిస్తూ.. రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.

ప్రైవేట్‌ ఆస్పత్రులతో కమీషన్‌ దందాలు

కొందరు ఆర్‌ఎంపీలు హైదరాబాద్‌, కరీంనగర్‌ వంటి నగరాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్స్‌, పాథాలజీ ల్యాబ్స్‌తో కుమ్మక్కయి ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రథమ చికిత్స కోసం వచ్చిన వారికి లేని రోగాన్ని అంటగట్టి తాము ఏజెంట్‌గా పనిచేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు రోగం చిన్నదే అయినా ఆ భయాన్ని పెద్దగా చూపి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఏజెంట్లకు ఒక్కో పేషెంట్‌ను రెఫెర్‌ చేస్తే రోగాన్ని బట్టి 40శాం నుంచి 50శాతం కమీషన్‌ ఇస్తున్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఇలాంటి ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక చికిత్స కేంద్రాలు అని మాత్రమే బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. యాంటీబయోటిక్స్‌ ఇవ్వడం.. ప్రిస్క్రిప్షన్‌ రాయడం, పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఎంపీలు బెడ్స్‌ వేసి చికిత్స అందించొద్దు. అలాంటివి మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

– ప్రమోద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement