
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
ఈనెల 10న.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన గొలపల్లి వెంకమ్మ (వృద్ధురాలు) మెడలోంచి రెండున్నర తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని దొంగలు ద్విచక్రవాహనంపై వచ్చి చోరీ చేశారు.
ఈనెల 17న.. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన నేరెల్ల లచ్చవ్వ (వృద్ధురాలు) మెడలోంచి గుర్తుతెలియని దొంగ తులంన్నర కుత్తికట్టు ఎత్తుకెళ్లారు.
● జల్సాల కోసం దొంగతనాల బాట ● భయాందోళన చెందుతున్న ప్రజలు
జగిత్యాలక్రైం: ఒంటరిగా తిరుగుతున్న మహిళలే టార్గెట్‌గా చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెడలో నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. ద్విచక్రవాహనాలపై వస్తున్న నిందితులు ముఖాలకు మాస్క్‌లు ధరించి వాహనాలపై... ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారాన్ని లాక్కెళ్తున్నారు. కాపు కాసి మరీ జనసంచారం లేనిచోట వారిని వెంబడిస్తున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా చూసుకుని ప్రధాన రహదారులతోపాటు చిన్నచిన్న గల్లీల్లో చోరీలకు పాల్ప డుతున్నారు. పొరండ్లకు చెందిన గొల్లపల్లి వెంకవ్వ మెడలో నుంచి బంగారాన్ని లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. వారి చిత్రాలను ఆంధ్రప్రదేశ్‌తోపాటు, వివిధ రాష్ట్రాలకు స్థానికల పోలీసులు పంపించారు.
జల్సాల కోసమే చోరీలు..
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న వారంతా 18 నుంచి 25 ఏళ్లలోపే వారేనని తెలుస్తోంది. గతంలో పట్టుబడిన వారు కూడా అదే వయస్సు గల వారు కావడం గమనార్హం. వీరంతా జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ.. వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు.