కొలిక్కిరాని ‘మెట్‌పల్లి క్లబ్‌’ | - | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని ‘మెట్‌పల్లి క్లబ్‌’

Sep 20 2025 6:18 AM | Updated on Sep 20 2025 6:18 AM

కొలిక్కిరాని ‘మెట్‌పల్లి క్లబ్‌’

కొలిక్కిరాని ‘మెట్‌పల్లి క్లబ్‌’

● ఇంకా సమసిపోని వివాదం ● స్థల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని ఉన్నతాధికారుల సిఫారసు? ● ఆందోళనలో కొనుగోలుదారులు ● తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిలదీత

మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని మెట్‌పల్లి క్లబ్‌ సొసైటీకి చెందిన స్థల విక్రయ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని విక్రయించారని సొసైటీలోని మృతిచెందిన సభ్యుల కుటుంబీకులు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ద్వారా జిల్లా కలెక్టర్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా, పోలీసులు సొసైటీ ముఖ్యులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలతో ఆందోళన చెందుతున్న కొనుగోలు దారులు.. శుక్రవారం సొసైటీ ముఖ్యల వద్దకు వెళ్లి వివాదంపై నిలదీసినట్లు తెలిసింది. తమకు స్థలం అప్పగించాలని లేకుంటే తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని పట్టుబట్టినట్లు సమాచారం.

వివాదం ఇలా మొదలు..

● మెట్‌పల్లి క్లబ్‌ సొసైటీకి స్థానిక రాంనగర్‌లో 1,864 గజాల స్థలం ఉంది. దీనిని గత జూలైలో ఓపెన్‌ టెండర్‌ ద్వారా సుమారు రూ.4కోట్ల్లకు ఇద్దరి వ్యక్తులకు విక్రయించారు.

● అయితే ఈ విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని తమకు తెలపకపోవడమే కాకుండా వచ్చిన సొమ్ములో సమాన వాటా ఇవ్వలేదని మృతిచెందిన సభ్యుల కుటుంబీకులు ఆరోపించారు.

● ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుకు తెలిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

● దీంతో జువ్వాడి విక్రయ వ్యవహారాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకపోగా..ఆయన విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా సహాకార అధికారి మనోజ్‌కుమార్‌ను ఆదేశించారు.

● బాధితులు ఫిర్యాదు మేరకు పలువురు సొసైటీ ముఖ్యులపై కేసు నమోదయింది.

నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు

● కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన డీసీవో మనోజ్‌కుమార్‌ పలు కోణాల్లో విచారణ జరిపి, సొసైటీ ముఖ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.

● ప్రధానంగా మృతిచెందిన సభ్యుల కుటుంబీకులకు సభ్యత్వం ఇవ్వకపోవడం, సొసైటీ తరహా వ్యవహారాలతో నిమిత్తం లేని వ్యక్తులకు విక్రయించడం వంటివి చేసినట్లు గుర్తించి సంబంధిత నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.

● దీనిని పరిశీలించిన కలెక్టర్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

కొనుగోలుదారుల ఆందోళన

● రెండునెలలకు పైగా ఈ వివాదం కొనసాగుతుండడంతో కోట్లాది రూపాయలు చెల్లించిన కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

● వివాదం పరిష్కారం కోసం సొసైటీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది.

● మొత్తానికి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement