
జాడలేని అప్రోచ్ రోడ్డు
అస్తవ్యస్తంగా మారిన రోడ్డు
కోరుట్ల: రైల్వే స్టేషన్‌లో పనులు మొదలుపెట్టడానికి ముందే అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయడంపై శ్రద్ధ చూపాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు నరకం చూపుతోంది. కేవలం ప్రయాణికులకే కాదు..కల్లూర్ రోడ్ నుంచి అయిలాపూర్ మీదుగా మల్లాపూర్ మండలానికి లింకు కలిపే ఈ రోడ్డు సరిగా లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 8 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఈ ప్రాంత నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం విచారకరం.
అప్రోచ్‌రోడ్డు లేకుండానే..
ఈ ఏడాది జనవరిలో కోరుట్ల రైల్వే స్టేషన్‌లో వ్యాగన్ల లోడింగ్, అన్‌లోడింగ్ కోసం అదనపు రైల్వే ట్రాక్‌తో పాటు బల్లాస్ట్ లోడింగ్ పాయింట్(కంకర, ఇనుము, ఇసుక, వంటి సరుకుల నిల్వ–సరాఫరా కేంద్రం) ఏర్పాటుకు సంబంధించి రూ.17 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించక ముందే కాంట్రాక్టర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఆ పని జరగలేదు. అప్రోచ్ రోడ్డు పనులు జరగకుండానే కాంట్రాక్టర్ కంకర నిల్వ కేంద్రం పనులు మొదలెట్టారు. ఈ క్రమంలో గతంలో ఉన్న మట్టి రోడ్డు సైతం దెబ్బతింది. దీంతో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి తరుచూ రోడ్లను మార్చుతుండటంతో మరింత సమస్యగా మారింది. ఈ రోడ్డు సైతం మట్టితో వేయడంతో బురద మయంగా మారిపోయింది. కంకర లోడింగ్ పాయింట్ కోసం పోసిన కంకర రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు మరింత అవస్థలు ఎదురవుతున్నాయి.
బిజీగా రైల్వేస్టేషన్..
జిల్లాలోని లింగంపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి రైల్వే స్టేషన్లలో అత్యధికంగా కోరుట్ల నుంచి ముంబాయి, హైదరాబాద్‌కు రాకపోకలు ఉంటాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి వేళ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండటం, అక్కడికి వెళ్లే అప్రోచ్ రోడ్డు సవ్యంగా లేక రైల్వే స్టేషన్ దారి తప్పిపోతున్నారు. ప్రస్తుతం రాకపోకల కోసం ఉన్న రోడ్డు ఎక్కడికక్కడే కాగిపోవడం..మరో రోడ్డులో వెళ్లాల్సి రావడం..మళ్లీ ఆ తోవలోనూ రోడ్డు అర్ధంతరంగా ఆగిపోవడం ఫలితంగా రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. కొంత మంది రోడ్డు సరిగా లేక ప్రమాదాల పాలైన సందర్భాలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం కోరుట్ల రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఏలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు..సరికదా స్టేషన్‌కు వెళ్లే మట్టి రోడ్డు దెబ్బతిందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకొని ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

జాడలేని అప్రోచ్ రోడ్డు