
పండుగ పూట చిమ్మచీకట్లు..!
ఇది బైపాస్‌రోడ్‌లోని ధర్మపురి వెళ్లే ప్రాంతం. ఇక్కడ రెండు కిలోమీటర్ల వరకు స్ట్రీట్‌లైట్లు లేవు. రాత్రివేళలో వాహనదారులు, మహిళలు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల కరెంట్ స్తంభాలు కూడా లేవు.
జగిత్యాల: ఆడపిల్లలు, మహిళలు ఏటా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సమీపించింది. ఇప్పటికే బొడ్డెమ్మ వేడుక ప్రారంభమయ్యింది. అయితే జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలో వీధిదీపాలు లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్లకోసారి పాలకవర్గాలు మారుతున్నా.. స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నా సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. అయినప్పటికీ ఏ ఒక్క కాలనీలోనూ వీధిదీపాలు లేకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అసలే కుక్కలు, పోకిరీల బెడద ఎక్కువవుతోంది. చైన్‌స్నాచింగ్ సంఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. వీధిదీపాలు ఉంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశమున్నా.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మొన్నటివరకు ఓ ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు ప్రకారం.. వీధిదీపాలు వేసేది. ఆ కాంట్రాక్టు ఒప్పందం ముగిసిపోవడంతో బల్దియా అధికారులు వీధిదీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీధి స్తంభాలున్నా లైట్లు లేకపోవడం.. మరికొన్ని చోట్ల కరెంట్ స్తంభాలే లేకపోవడంతో రాత్రి ఏడు గంటలు దాంటిందంటే వెళ్లలేని పరిస్థితి ఉంది.
మరమ్మతుల్లో జాప్యం
లైట్లు కాలిపోయినా.. వెలగకపోయినా వెంటనే మరమ్మతు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్తి పన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారే తప్ప తమకు కావాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

పండుగ పూట చిమ్మచీకట్లు..!