
టేకు చెట్లు నరికి.. మొరం గుట్టలు తవ్వి
● అడ్డగోలుగా మట్టి అక్రమ రవాణా ● పట్టించుకోని రెవెన్యూ..మైనింగ్ ● అధికారుల వివక్ష
కోరుట్ల: రెవెన్యూ.. మైనింగ్ శాఖలు మొరం తవ్వకాలు విషయంలో వివక్ష చూపుతున్న వైనం వెలుగుచూస్తున్నా.. అనుమతులు లేకుండా అడ్డగోలుగా మొరం గుట్టలు తవ్వేస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ లేవు. ఓ దశలో ఈ రెండు శాఖలు ఫిర్యాదులు వస్తేనే పనిచేస్తాయా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లో పలు గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ మొరం గుట్టలు తవ్వేయడం.. వాటి వెంట అటవీ శాఖ అధ్వర్యంలో నాటిన టేకు చెట్లు నరికేయడం వంటి పనులు నిత్యకృత్యంగా మారాయి.
నాలుగు చోట్ల..
కోరుట్ల మండలంలో చినమెట్‌పల్లి, కల్లూర్–అయిలాపూర్ శివారు, సంగెం గ్రామ సమీపంలో, కోరుట్ల పట్టణ శివారుల్లో మొరం, మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మొరం గుట్టలను తవ్వి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో మొరానికి డిమాండ్ పెద్ద ఎత్తున పెరగడంతో అక్రమార్కులు మొరం గుట్టలను తవ్వి పట్టణాల పరిసరాల్లో డంపింగ్ చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు నిల్వ చేసి వాటిని మెల్లమెల్లగా ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు నయాపైసా చెల్లించకుండానే మొరం టిప్పర్‌కు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు.. ఒక్కో ట్రాక్టర్ మొరాన్ని రూ.1200కు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మొరం గుట్టల వెంబడి ఉన్న నాటిన టేకు చెట్లు వందలాదిగా మాయమవుతున్న వైనం కలవరపెడుతోంది. వీటి నరికివేత విషయం అటవీ శాఖ అధికారుల దృష్టిలో లేకపోవడం విడ్డూరం. ఎవరైనా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వేలం వేసి..
కోరుట్ల మండలంలోని చినమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో మొరం గుట్టలను వేలం వేసి మరీ గుట్టచప్పుడు కాకుండా మట్టిని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని మొరం అమ్మకాలు సాగిస్తుండగా ఈ అనుమతులు కేవలం రాజకీయంగా అండ ఉన్న వారికే దక్కుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జీవనోపాధి కోసం మొరం తవ్వకాలు చేసేవారికి అనుమతులు ఎందుకు రావడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల వీడిసిలు మొరం వేలంపాటలతో గ్రామాభివృద్ది కోసం నిధులు సమకూర్చుకుంటున్నామని చెబుతున్నా.. పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మొరం గుట్టల వేలం పాటల విషయం తెలిసినా మైనింగ్, రెవెన్యూ అధికారులు సరైన విచారణ జరపకపోవడం వెనక కారణాలు అంతుచిక్కడం లేదు. మొరం గుట్టల తరలింపు వెనక పలు పార్టీల నేతలు ఉండటంతో రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోకుంటే కాలక్రమేణా సహాజ వనరులు క్షీణించి భారీ వర్షాలకు కోతలు ఏర్పడి గ్రామాల పరిసరాల్లోని వాగులు, చెరువుల్లోకి యధేచ్చగా వరద నీరు చేరి మత్తడి దాటి గ్రామాలను ముంచెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.